హైదరాబాద్: తనపై ఆరోపణలు నిరూపించకపోతే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ముక్కు నేలకు రాయడంతో పాటు రాజీనామా చేయాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే సిఎం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజకీయాల్లోంచి వెళ్లిపోవాలని సవాల్ విసిరారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోవడంతో పాటు మళ్లీ రాజకీయాల్లోకి రాను అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. తనపైన ఒకటి కాదు మూడు హత్య కేసులు పెట్టారని, కాంగ్రెస్ పెట్టిన మూడు కేసుల్లో కోర్లులు తనని నిర్దోషిగా తేల్చాయని తెలియజేశారు.
పెట్రోల్ బంక్‌లు, మిర్యాలగూడ కేసులు ఉన్నాయని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారని, వాళ్లు చెప్పిన కేసులపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తాను మాట్లాడితే సిఎం రేవంత్ రెడ్డి భూజాలు ఎందుకు తడుముకుంటున్నారని, మా నాయకుడు కెసిఆర్ హరిశ్చంద్రుడేనని, వాళ్లలా సంచులు మోసే చంద్రుడు కాదని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. చంద్రుడి సంచులు మోసి జైలుకు వెళ్లింది రేవంత్ రెడ్డి అని చురకలంటించారు. విద్యుత్ అంశంలో అధికార పక్షం చేస్తున్న ఆరోపణలు సరైనవి కావన్నారు. కొత్తగూడెం విద్యుత్ ప్లాంట్ కూడా బిహెచ్‌ఎల్‌కే ఇచ్చామని, కోమటిరెడ్డి మాట్లాడిన ప్రతీ అక్షరం రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
‘జగదీశ్వర్‌రెడ్డి సవాలు స్వీకరిస్తున్నా, నేను చేసిన ఆరోపణలు నిరూపించకపోతే మంత్రి, ఎంఎంఎల్ పదవులకు రాజీనామా చేస్తా’ అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిసవాల్ విసిరారు.