చరిత్రలో నిలిచిపోయే విధంగా వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించనున్న భారాస రజతోత్సవ మహాసభ ఉంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూర్ ఎస్ మండలం, నెమ్మికల్ దండు మైసమ్మ తల్లి వద్ద ఆయన పూజ చేసి స్వయంగా ఎడ్లబండిని నడిపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సారధ్యంలో జరుగనున్న భారీ బహిరంగ సభకు సూర్యాపేట నుంచి రైతులు ఎడ్ల బండ్లతో తరలివెళ్లడం ఆనందంగా ఉందన్నారు. ‘బండెనక బండి కట్టి…16 బండ్లు కట్టి’ అన్న పాటను సూర్యాపేట రైతులు మళ్లీ గుర్తు చేస్తున్నారని అన్నారు. రైతులతో పాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నారని అన్నారు. నీడలో ఉన్న వాళ్లం ఎండనబడ్డామని బాధతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని అన్నారు.
దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలాగా మార్చిన ఘనత కెసిఆర్‌ది అని, అటువంటి నేతను వదులుకున్నామన్న బాధలో ప్రజలంతా ఉన్నారని అన్నారు. అందుకే కెసిఆర్ మీద అభిమానంతో రజతోత్సవ సభకు రైతులు స్వయంగా ఎడ్లబండ్ల పై బయలుదేరారని అన్నారు. ప్రజలంతా హాజరై ఈ సభను కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేక సభలాగా నిర్వహించుకోవాలని భావిస్తున్నారని తెలిపారు. పది రోజులు క్రితం రైతులు కలిసి ఎడ్లబండ్లపై వెళ్తామంటే…130 కిలోమీటర్లు మేర ఈ ఎండలో వెళ్లడం సాధ్యమైద్దా అని అన్నానని, కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను తట్టుకున్నోళ్లం.. ఈ ఎండలను తట్టుకోవడం లెక్క కాదని ధీమగా చెప్పారని అన్నారు. సభ సమయానికి ముందుగా అనుకున్న ప్రకారం 5 రోజుల ముందుగా బయలుదేరారని, కెసిఆర్‌పైన రైతన్నలు చూపుతున్న అభిమానాన్ని చూస్తుంటే కాంగ్రెస్‌పై వారికి ఎంత వ్యతిరేకత ఉన్నదో ఇట్టే అర్థవుతుందని అన్నారు.
అంకుముందు జగదీశ్‌రెడ్డి స్వయంగా సుమారు 5 కిలోమీటర్లు ఎండ్లబండిని నడిపి యాత్రను ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, జడ్‌పి మాజీ వైస్ ఛైర్మన్ గోపగాని వెంకట నారాయణ, ఆత్మకూర్ ఎస్ మండల అధ్యక్షుడు తూడి నర్సింహారావు, పార్టీ నాయకులు చెరుకు సుధాకర్, కొణతం సత్యనారాయణ రెడ్డి, కనగాని లక్ష్మీబ్రహ్మం, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వై.వెంకటేశ్వర్లు, జూలకంటి జీవన్ రెడ్డి, రౌతు నర్సింహారావు, మారిపెద్ది శ్రీనివాస్, నెమ్మాది భిక్షం, జీడి భిక్షం తదితరులు పాల్గొన్నారు.