సూర్యాపేట:అమెరికాలో స్థిరపడిన తెలంగాణా వాసులు సూర్యపేట మెడికల్ కళాశాలకు అందిస్తున్న సేవలు అనిర్వచనియమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అక్కడ ఉండి మాతృభూమి రుణం తీర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్న తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. సూర్యాపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా ప్రజలకు అద్భుతమైన సేవలు అందిస్తున్న విషయాన్ని తెలుసుకున్న అమెరికాలోని ప్రవాసులు మరింత అభివృద్ధికి గాను ఆర్థిక సహాయం అందించడాన్ని మంత్రి స్వాగతించారు. అమెరికాలోని టిడిఎఫ్ (తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్)ఆధ్వర్యంలో సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పేషేంట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసియు కేంద్రాన్నీ సోమవారం ఉదయం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐసియు కేంద్రానికి కావాల్సిన 10 బెడ్లు, ఐదు మానిటర్లు, రెండు వెంటిలేటర్లతో పాటు రెండు సిరంజీ పంపులు ఐసియుకు పూర్తి మెటీరియల్ ను టిడిఎఫ్ ప్రతినిధులు సమకూర్చారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చిందని, ప్రభుత్వ వైద్య సేవలు అవసరమున్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలకు చేయూతనందించేందుకు గాను ప్రవాస భారతీయులతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం పట్ల మంత్రి జగదీశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Jagadish reddy inaugurated ICU center in Suryapet govt hospital