మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కెటిఆర్ ఫోబియా పట్టుకుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎంఎల్‌ఎ గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నల్లగొండలో బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ భూపాల్ రెడ్డి సహా పార్టీ శ్రేణుల అరెస్టుపై ఆయన మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారంవిలేకరులతో మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో పోలీస్, కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. మంత్రి వెంకట్ రెడ్డి కెటిఆర్ ఫొటో చూసినాచ గులాబీ రంగు చూసినా భయపడుతున్నారని వ్యాఖ్యా నించారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలి కావాలనే మున్సిపల్‌అధికారులు బిఆర్‌ఎస్ ఫ్లెక్సీలను చించేశారని ఆరోపించారు. మంత్రి వెంకట్ రెడ్డి సోయిలో లేకుండా ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వెంకట్ రెడ్డి మాటలు విని డ్యూటీ చేస్తే అధికారులకు ఇబ్బందులు తప్పవని, చట్ట ప్రకారం పనిచేయాలని హితవు పలికారు.
భూపాల్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, బేషరతుగా అతనిని, తమ పార్టీ శ్రేణులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు రాజ్యం అమలు చేస్తే చూస్తూ ఊరుకోమని, పాలన ఇలానే కొనసాగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో వచ్చిన తిరుగుబాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వల్లే వచ్చిందని, మంత్రి స్వయంగా ఫోన్ చేసి తమపై కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని, మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులకు ఏం పని అన్నారు. కాంగ్రెస్ నిజస్వరూపం ఒక్కొక్కటిగా బయటపడుతోందని, కాంగ్రెస్ పాపాలపుట్ట పగులుతోందని, కాంగ్రెస్ రహిత తెలంగాణ కోసం నల్లగొండ నుండే ఉద్యమం మొదలవుతుందని అన్నారు. కాంగ్రెస్ హఠావో.. తెలంగాణ బచావో నినాదం మొదలైంది గుర్తు పెట్టుకోండి అంటూ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల్లో ప్రజల నిరసనపై స్పందిస్తూ గ్రామసభల్లో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడుతోందని,
రెండుసార్లు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుని బుట్టదాఖలు చేశారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, అసలైన వారిని వదిలి అర్హత లేని వారికి లబ్ధి చేస్తున్నారని, జాబితాలో అర్హు పేర్లు లేకపోవడంతో ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారని, కాంగ్రెస్ మోసాలపై ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.