Monday, December 23, 2024

బిజెపి నేతలు శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతారు: జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

బిజెపి నేతలు శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతారు
ఎన్ని దీక్షలు చేసినా బిజెపి నాయకులకు ఉద్యోగాలు వచ్చే ప్రసక్తే లేదు
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి నాయకులు శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్ని దీక్షలు చేసినా బిజెపి నాయకులకు ఉద్యోగాలు వచ్చే ప్రసక్తే లేదని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్‌ఎల్పీలో ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఎమ్మెల్సీ రవీందర్ రావుతో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల నాయకులు వారం రోజుల నుంచి చిత్ర, విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

బండి సంజయ్ ధర్నా, దీక్షలు చేస్తే ఢిల్లీలో చేయాలని, ఇక్కడ కాదని జగదీశ్ రెడ్డి సూచించారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిన మోడీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని మంత్రి పేర్కొన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఈ దేశ యువతను మోడీ మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ముందు దేశంలో ఉద్యోగాలు భర్తీ చేయమని మోడీకి చెప్పి బిజెపి నేతలు ఇక్కడ ధర్నాలు చేయాలని, అపుడు బిజెపి నేతలకు ఉద్యోగాలు ఇచ్చేది తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారని మంత్రి పేర్కొన్నారు.

నిరుద్యోగులకు నష్టం జరగనివ్వం
నిరుద్యోగులకు నష్టం జరగనివ్వమని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపి నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరిగేవి కుంభకోణాలనీ, తెలంగాణలో మాత్రం స్కీమ్స్ అమలవుతున్నాయని, వ్యాపం స్కాంలో మధ్యప్రదేశ్లో సాక్షులను చంపిన నీచులు బిజెపి నేతలని ఆయన మండిపడ్డారు. బిజెపి పాలిత రాష్ట్రాలన్నీ కలిపినా తెలంగాణ అన్ని ఉద్యోగాలు ఇవ్వలేదనీ, బండి సంజయ్‌కు తాను ఛాలెంజ్ చేస్తున్నానని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపించగలరా..? అని జగదీశ్ రెడ్డి సవాల్ చేశారు.

కెటిఆర్ మీద ఈర్ష్యతోనే బిజెపి నాయకుల తప్పుడు ఆరోపణలు
కెటిఆర్ గురించి మాట్లాడే స్థాయి రాష్ట్ర బిజెపి నాయకులకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల ఐటీ మంత్రుల పేర్లు బిజెపి నేతలు చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. కానీ తెలంగాణ ఐటీ మంత్రి కెటిఆర్‌ను ప్రపంచం మొత్తం గుర్తిస్తుందన్నారు. ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత కెటిఆర్‌దని అని ఆయన స్పష్టం చేశారు. కెటిఆర్ మీద ఈర్ష్యతోనే బిజెపి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

దమ్ముంటే సిట్‌కు ఆధారాలు సమర్పించండి
పేపర్ లీకేజీకి సంబంధించి కెటిఆర్‌పై ఆరోపణలు చేయడం సరికాదనీ, దమ్ముంటే సిట్‌కు బిజెపి నాయకులు ఆధారాలు సమర్పించాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. సిట్ ఎదుట హాజరయ్యేందుకు బండి సంజయ్ ఎందుకు వెనుకంజ వేస్తున్నారని, బిజెపి నేతలను మాటలను నిరుద్యోగులు నమ్మరన్నారు. దోషులు ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News