Monday, December 23, 2024

రుణమాఫీపై సిఎం చెప్పింది అబద్ధమని తేలింది: జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రుణమాఫీ పూర్తయిందని సిఎం రేవంత్‌రెడ్డి డ్యాన్సులు చేస్తున్నారని, మంత్రులు మరోలా మాట్లాడుతున్నారని బిఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రుణమాఫీపై సిఎం చెప్పింది అబద్ధమని మంత్రి ఉత్తమ్ మాటలతో అర్దమవుతున్నదని పేర్కొన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా..? అని సిఎంను ప్రశ్నించారు. ప్రతిపక్షంగా ఇంకా తాము పని మొదలు పెట్టలేదని, ముందు ముందు తమ తడఖా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మాజీ ఎంఎల్‌ఎలు పైళ్ల శేఖర్ రెడ్డి, గ్యాదరి కిశోర్, బిఆర్‌ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జగదీశ్‌రెడి మాట్లాడుతూ, ఇప్పటివరకు ప్రభుత్వం రుణమాఫీ లబ్దిదారుల సంఖ్యను స్పష్టంగా చెప్పడం లేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా 13 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమచేయాలని మంత్రి ఉత్తమ్ చెప్పారని తెలిపారు. మాఫీ చేశామని సిఎం చెబుతుంటే, ఇంకా పెండింగ్ ఉందని ఉత్తమ్ చెబుతున్నారని విమర్శించారు. సకాలంలో రుణమాఫీ చేయనందుకు సిఎం రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏ తేదీలోపు రైతుల ఖాతాల్లో నిధులు వేస్తారో స్పష్టంగా చెప్పాలని అన్నారు. తెలంగాణ సోయి, ఆత్మ లేని వ్యక్తులు సచివాలయంలో ఉండటం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే కచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్నారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ నోటి నుంచి ఒక్కసారైనా తెలంగాణ పదం ఉచ్ఛరించారా..? అని అడిగారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టాలని ప్రొఫెసర్ హరగోపాల్ సహా కవులు, కళాకారులు రాహుల్ గాంధీకి లేఖ రాశారని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News