Sunday, December 22, 2024

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు:జగదీశ్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తప్పులను సోషల్ మీడియా ఎత్తిచూపుతోందని చెప్పారు. రేవంత్ రెడ్డికి ముందుంది ముసళ్ళ పండగ అని పేర్కొన్నారు. పరిపాలనలో రేవంత్ రెడ్డి నైజం బయటపడిందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఢీల్లికి మూటలు పంపడంలో రేవంత్ రెడ్డి మంత్రులు పోటీ పడుతున్నారని ఆరోపించారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ మదన్ బి లోకూర్ ఎప్పుడు పని చేశారో తమకు తెలియదని అన్నారు. విచారణ చేయకుండా ఆయన నివేదిక ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విద్యుత్ కమిషన్ విచారణ పూర్తి చేసినట్లు ప్రభుత్వం అధికారికంగా చెప్పిందని, తమ వివరణ చైర్మన్ తీసుకోలేదని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు తమ పైన విషం కక్కుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు.

కమిషన్ వేస్తున్నట్లు సిఎం అసెంబ్లీలో ప్రకటించారని, కమిషన్ విచారణ పూర్తయితే అసెంబ్లీలో వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తమను జైల్లో వేసే ఆలోచన వస్తే ఆలస్యం ఎందుకు..?..తమను జైల్లో పెట్టడానికి భయపడుతున్నారా..? అని ప్రశ్నించారు. విద్యుత్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ 24 గంటల కరెంటు ఇచ్చినందుకు జైల్లో పెడతారా..? అని అడిగారు. నివేదికలో ఏమీ ఉండదని ముందే లీకులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఏడాది సంబరాల్లో రాహుల్ గాంధీ పోలీసులు లేకుండా అశోక్ నగర్‌కు, రైతుల వద్దకు రావాలని అన్నారు. రాష్ట్రంలో ఒక్క వర్గం సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డికి చెప్పే ధైర్యం ఉందా..? అని అడిగారు. ఏం చేశారని రేవంత్ రెడ్డి ఏడాది సంబురాలు చేసుకుంటారని నిలదీశారు. పోలీసులను చూసి ప్రభుత్వం భయపడే స్థితికి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసదుద్దీన్ ఒవైసీ గురించి ముస్లింలకు తెలుసు
ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఒవైసీ గురించి ముస్లింలకు తెలుసు అని జగదీశ్‌రెడ్డి అన్నారు. అసదుద్దీన్‌ను ముస్లీం సోదరులే పట్టించుకోరని, ఆయన గురించి మాట్లాడటం టైం వేస్ట్ అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ జాతకాలు మా దగ్గర ఉన్నాయి… అవి చెబితే వాళ్లు తట్టుకోలేరు.. మూసీ సుందరీకరణకు బిఆర్‌ఎస్ చేసిందేమీ లేదన్న అసదుద్దీన్ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి స్పందించారు. ఎవరి జాతకాలు ఏంటో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. మూసీ ప్రాజెక్టును మొదలు పెట్టింది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని, తాము చెప్పిన బడ్జెట్‌లోనే పూర్తి చేసే సత్తా తమకు ఉందని స్పష్టం చేశారు.

ఎవరు ఎన్ని ప్రేలాపనలు చేసినా మూసీ బాధితుల తరఫున బిఆర్‌ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి పేదలకు న్యాయం చేస్తామన్నారు. తెలంగాణలో రైతాంగం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ లెక్కలతో రుణమాఫీ చేశామని ప్రభుత్వం అంటోందని విమర్శించారు. కాంగ్రెస్ రుణమాఫీని దేశం మొత్తం చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. పత్తి రైతులకు కాంగ్రెస్, బిజెపి పార్టీలు ద్రోహం చేశాయని చెప్పారు. సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో ఎంజాయ్ చేస్తున్నారని, పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మోదీని తిట్టినా బిజెపి నేతలు సైలెంట్‌గా ఉన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డిని విమర్శించే మొగోడు బిజెపిలో లేడు అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News