చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో సమ న్యాయంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ విభేదాలకు ఆస్కారం లేకుండా గతానికి భిన్నంగా పధకాలు మంజూరీ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని ఆయన కొనియాడారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు(యస్)మండలం దాచారం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం నేతలు కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కొద్దో గొప్పో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు వారి వారి పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని ఆయన గుర్తుచేశారు. అటువంటి వివక్ష లేకుండా అందరిని తెలంగాణా బిడ్డలు అనుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకన్నింటిని రాజకీయ విభేదాలకు అతీతంగా పంపిణీ చేస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అయితే, అదే సమయంలో సంక్షేమ పథకాలు అనుభవిస్తాం, అభివృద్ధిని ఆస్వాదిస్తాం అంతిమంగా తల్లి పాలు తాగి రొమ్మును తంతాం అనుకుంటే అంతిమంగా నష్టపోయేది ప్రజలే అన్నారు. యావత్ భారతదేశంలోనే అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో పరుగులు పెట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు.
ఆయన మార్గదర్శనంలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ నందించడం తో పాటు,వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ నందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణా రికార్డులకెక్కిందన్నారు. అంతే గాకుండా దేశంలోనే ఎక్కడా లేని విదంగా రైతుబంధు, రైతు భీమాలతో పాటు కల్యాణాలక్షి/షాధిముభారక్, కెసిఆర్ కిట్, అమ్మవడి వంటి విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణా రాష్ట్రానికే పరిమితం అన్న విషయాన్ని విస్మరించకూడదన్నారు. అటువంటి మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో గ్రామాలకు గ్రామాలు ఏకమై ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. యింకా ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తూడి నరసింహ రావు, నాయకులు మర్ల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Jagadish Reddy Speech in Dacharam