అమరావతి: రైతుల పట్ల ఇదేనా మీ చిత్తశుద్ధి అని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసిపి నేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తీరుపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. తమ లేఖలోనే మిర్చి గరిష్ట ధర రూ. 27 వేలు పలికిందని చెప్పారు. నాడు పెట్టుబడి ఖర్చులకు రూ. లక్ష.. నేడు లక్షన్నర అని విమర్శించారు. ధరలు పడిపోవడంతో ప్రతి రైతు రూ. లక్షకు పైగా నష్టం జరుగుతుందని తెలియజేశారు. రైతుల కోసం కొత్త మద్దతు ధరలు ఎందుకు ప్రకటించలేదని జగన్ ప్రశ్నించారు. పత్తి, పెసర, మినుము, కంది, టమోటా, మిర్చి, ధాన్యం సహా పలు పంటలకు మద్దతు ధర రావడం లేదని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయడం లేదని, మీ చేతిలో ఉన్న మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయకుండా… కేంద్రానికి లేఖలు రాయడంపై రైతులను మోసం చేయడం కాదా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై ఆధారపడకుండా మార్క్ ఫెడ్ ద్వారా మిర్చిని కొనాలని చెప్పారు. తాను మిర్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా?నని అన్నారు. రైతులకు బాసటగా వెళ్లినందుకు మాపై కేసులు పెడతారా? నని ఫిబ్రవరి 15న మీ మ్యూజికల్ నైట్ కోడ్ అడ్డం రాలేదా?నని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. అన్యాయంగా తమపై కేసులు ఎలా పెడుతారని, ఇది అప్రజాస్వామికం కాదా? అని ప్రశ్నించారు. గురువారం జరిగిన కార్యక్రమంలో పలానా వారికి ఓటు వేయమని కూడా చెప్పలేదన్నారు. తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.