Saturday, November 23, 2024

హ్యాండ్‌బాల్ పై జగన్ మోహన్‌రావు పట్టు

- Advertisement -
- Advertisement -

Jagan Mohan Rao puts an end to crisis in National Handball Association

ఉత్తరాది ఆధిపత్యానికి గండికొట్టిన తెలుగోడు
ఎజిఎంలో 33కు గాను 26 రాష్ట్ర సంఘాల మద్దతు
తిరుగుబాటు సెక్రటరీ సలూజ, ఉపాధ్యక్షుడు ప్రదీప్‌పై వేటు

లక్నో: జాతీయ హ్యాండ్‌బాల్ సంఘంలో నెలకొన్న సంక్షోభానికి ఆ సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావు ముగింపు పలికారు. ఆదివారం లక్నోలో జరిగిన ఆ సంఘం సర్వసభ్య వార్షిక సమావేశం (ఎజిఎం)లో 33కు గాను 26 గుర్తింపు ఉన్న రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘాలు పాల్గొన్నాయి. వీటిలో నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం రాష్ట్రాల ప్రతినిధులు జూమ్ యాప్‌లో ఎజిఎంకు హాజరు కాగా మిగిలిన 23 రాష్ట్రాల కార్యనిర్వాహకులు ప్రత్యక్షంగా సమావేశంలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్, బిహార్, పంజాబ్, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాలు ఏజీఎంకు గైర్హాజరయ్యాయి. ఈ ఏజీఎంకు పరిశీలకులుగా ఆసియా హ్యాండ్‌బాల్ సంఘం సెక్రటరీ మహ్మద్ షఫీక్, భారత ఒలింపిక్ సంఘం నుంచి అభిజిత్ సర్కార్ జూమ్‌లో హాజరయ్యారు. అసోయేషన్‌లో గత కొంతకాలంగా చెలరేగుతున్న వివాదాలకు చెక్ చెప్పేందుకు అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అత్యవసర ఎజిఎంకు పిలుపునిచ్చారు.

భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కీలకమైన కార్యనిర్వాహక పదవి ఒక దానికి హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రసుత్త ఐఓఏ కోశాధికారి ఆనందీశ్వర్ పాండే పోటీ పడేందుకు సిద్ధమవుతుండడంతో ఆయన్ని దెబ్బకొట్టేందుకు సలూజను అడ్డం పెట్టుకొని ఒక వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోందని జగన్ మోహన్ రావు విమర్శించారు. హ్యాండ్‌బాల్ సంఘాన్ని అత్యంత బాధ్యతయుతంగా, జవాబుదారీతనంతో నడుపుతున్నామని.. కొందరు పనిగట్టుకొని బురద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలుగా మారిపోవని ఆయన మండిపడ్డారు. హ్యాండ్‌బాల్ సంఘంలో ఏమైనా ఇబ్బందులుంటే సంస్థాగతంగా ఉన్న తమ క్రమశిక్షణ కమిటీ వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని జగన్ మోహన్ రావు స్పష్టం చేశారు. ఒక తెలుగు వ్యక్తి, దక్షిణాది ప్రాంతానికి చెందిన వాడు జాతీయ క్రీడా సంఘానికి అధ్యక్షుడు కావడం రుచించని కొందరు పని గట్టుకొని చేస్తున్న చిల్లర రాజకీయాలను నేటి ఎజిఎంలో తిప్పికొట్టామని ఆయన అన్నారు.

సంఘం నిబంధనలను అతిక్రమించి వ్యక్తిగత స్వార్థంతో, కుయుక్తులు.. కుతంత్రాలతో పనిచేస్తున్న కార్యదర్శి ప్రీత్‌పాల్ సింగ్ సలూజ, ఉపాధ్యక్షుడు ప్రదీప్ కుమార్ బాలముచిను బాధ్యతల నుంచి తప్పించినట్టు ఆయన తెలిపారు. తాత్కాలిక సెక్రటరీగా ఇసి మెంబర్ సునీల్‌ను నియమించామని.. వచ్చేనెల 10న వీరి స్థానంలో నిబంధనలకు అనుగుణంగా కొత్త సెక్రటరీ, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటామని జగన్మోహన్ రావు చెప్పారు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా తనపై నమ్మకం ఉంచి ఎజిఎంలో తన నిర్ణయాలకు మద్దతు పలికిన 26 రాష్ట్ర సంఘాల ప్రతినిధులకు జగన్ మోహన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఏజిఎంకు ఉపాధ్యక్షులు రీనా సేన్, డికె సింగ్, అమల్ నారాయణ్, కోశాధికారి వినయ్ సింగ్ తదితరులు హాజరయ్యారు.

హైదరాబాద్ సబ్ జూనియర్ నేషనల్స్

వచ్చే నెల 7 నుంచి 11 వరకు హైదరాబాద్ వేదికగా బాలుర సబ్ జూనియర్ నేషనల్స్ చాంపియన్‌షిప్ నిర్వహించేందుకు ఎజిఎంలో నిర్ణయంలో తీసుకున్నట్టు జగన్ మోహన్‌రావు తెలిపారు. ఇక, కొవిడ్ కారణంగా వాయిదా పడిన హ్యాండ్‌బాల్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌కు ఆతిథ్య రాజస్థాన్ సర్కార్ నుంచి కూడా తాజాగా అనుమతులు లభించాయని.. ప్రసారకర్త స్టార్ స్పోర్ట్ నుంచి ప్రత్యక్షప్రసారాలకు విండో కేటాయించగానే లీగ్‌ను ప్రారంభిస్తామని జగన్ మోహన్ రావు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News