Tuesday, April 22, 2025

రూ.36 వేల కోట్ల నుంచి రూ.76 వేల కోట్లకు ఎందుకు పెంచారు: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: గ్రామస్థాయికి కూడా పార్టీ వెళ్లాలని, బూత్‌ లెవల్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలని వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసిపి పిఎసి సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సిపి అధినేత జగన్‌ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. పార్టీలో పిఎసి సభ్యులు క్రియాశీలకంగా ఉండాలని, ప్రజల తరపున పోరాటాలు మరింత ముమ్మరం చేయాలని సలహాలు ఇచ్చారు. ఇంకా సమయం ఉందని వేచి చూసే ధోరణి వద్దని హెచ్చరించారు. విశాఖలో రూ.3 వేల కోట్ల భూమిని ఊరు పేరు లేని కంపెనీకి సిఎం చంద్రబాబు నాయుడు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లులూ గ్రూప్‌కు రూ.2 వేల కోట్ల భూమిని కట్టబెట్టారని, రాజధానిలో నిర్మాణ పనుల అంచనాలను పెంచేశారని జగన్ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు.

ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయడం లేదన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనుల అంచనాలను విపరీతంగా పెంచుకొని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. రూ.36 వేల కోట్ల పనులను రూ.77 వేల కోట్లకు ఎందుకు పెంచారని నిలదీశారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీలు రేట్లు పెరిగాయని, కానీ డబుల్ కాలేదన్నారు. బటన్లు నొక్కితే ప్రజల ఖాతాల్లోకి నేరుగా వెళ్తుందని, అందుకే చంద్రబాబు నొక్కడం లేదని చురకలంటించారు. తాము బటన్లు నొక్కినట్టు చంద్రబాబు ఎందుకు నొక్కడం లేదని అడిగారు. నాలుగు లక్షల పెన్షన్లు తగ్గించాడని, కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదని, రెడ్ బుక్ పాలనతో అరాచకాలు సృష్టిస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. ఎంపి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిని చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారన్నారు. బాబు హయాంలో లిక్కర్ స్కామ్ పైన సిఐడి కేసు నమోదు చేసిందని గుర్తు చేశారు. తాము తీసుకొచ్చిన లిక్కర్ స్కీమ్ విప్లవాత్మకమైందని, ప్రైవేటు దుకాణాలు తీసేసి ప్రభుత్వం నిర్వహించిందని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News