అమరావతి: రెండు సిద్ధాంతాల మధ్య ఈ ఏడాది యుద్ధం జరుగబోతోందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విశ్వసనీయతకు- వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని, పెత్తందార్లతో పేదలు యుద్ధానికి సిద్ధమా? అని అడిగారు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్‌ఆర్‌సిపి ‘సిద్ధం’ సభలో సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులకు సిఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ రాయలసీమలో జన సముద్రం కనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. టిడిపి పాలనలో చంద్రబాబు పేరు చెబితే అక్కా చెల్లెళ్లు, ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు విద్యార్థులకు గుర్తుకు వచ్చే ఒక్క పథకమైనా ఉందా? అని ఎద్దేవా చేశారు.
రైతులు, వృద్ధులకు చంద్రబాబు ఏం చేశారని అడిగారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా?, 1995, 1999, 2014 టిడిపి మ్యానిఫెస్టోలో పది శాతమైన అమలు చేశారా? అని జగన్ దుయ్యబట్టారు. రంగు రంగుల మ్యానిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడని, చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఎవరికీ గుర్తుకురాదని, చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో వెన్నుపోట్లు, మోసాలు తప్ప ఏమీ లేదని చురకలంటించారు. చంద్రబాబు అబద్దాలను నమ్మొద్దని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండని, ప్రజలు చొక్కా మడత పెట్టి టిడిపికి 23 సీట్లకే పరిమితం చేశారని విమర్శలు గుప్పించారు. పక్క రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు మనకు అవసరమా? అని జగన్ ప్రశ్నించారు. రాయలసీమ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభ జరగడంతో వైఎస్ఆర్ సిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.