Saturday, November 23, 2024

కెసిఆర్‌ను పరామర్శించిన జగన్

- Advertisement -
- Advertisement -

యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఎపి సిఎం
ఇరువురి మధ్య 45 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు

జగన్, కెటిఆర్ ఆత్మీయ ఆలింగనం

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌ను ఎపి సిఎం జగన్ గురువారం కలిశారు. నందినగర్‌లోని కెసిఆర్ నివాసానికి చేరుకున్న సిఎం జగన్‌కు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు జీవన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులున్నారు. నివాసంలో కోలుకుంటున్న కెసిఆర్ వద్దకు చేరుకున్న జగన్ వారికి పుష్పగుచ్ఛాన్ని అందించి పరామర్శించారు. అనంతరం కెసిఆర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా బేగం పేటకు ప్రత్యేక విమానంలో చేరుకున్న సిఎం జగన్ ను మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఆహ్వానించారు.

సీఎం జగన్ వెంట ఎంపీ మిథున్ రెడ్డి, ఎంఎల్‌సి రఘురాం, ఎంఎల్‌ఎ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులున్నారు. అయితే కెసిఆర్‌ను జగన్ మర్యాదపూర్వకంగా కలిశారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. మరి వీరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయో తెలియాల్సి ఉంది. డిసెంబర్ 8న ఫామ్‌హౌస్‌లోని బాత్‌రూమ్‌లో జారిపడి కెసిఆర్ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. కెసిఆర్ కుటుంబీకులు వెంటనే ఆయనను యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ సంద ర్భంగా వైద్యులు పరీక్షించి తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిందని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. అనంతరం యశోద వైద్యుల ఆధ్వర్యంలో కెసిఆర్‌కు ఎముకల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన కెసిఆర్ డిసెంబర్ 15న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నందినగర్‌లోని పాత ఇంటికి వెళ్లారు. కెసిఆర్ ఇంట్లో కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఎపిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కెసిఆర్‌తో జగన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం దాదాపుగా 45 నిమిషాల పాటు ఇరువురు రాజకీయ అంశాలపై పార్టీ నేతలు ఎవరూ లేకుండా వారిద్దరే పలు అంశాలపై మాట్లాడుకున్నారని సమాచారం.
తల్లి విజయమ్మతో జగన్ చర్చలు…
మరో వైపు భేటీ ముగిసిన తర్వాత సిఎం జగన్ లోటస్ పాండ్‌కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం ఆయన నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సి ఉంది. కానీ లోటస్ పాండ్ ఇంటికి వెళ్లారు. అక్కడ జగన్ తల్లి విజయమ్మ ఉండటంతో ఆమెతో చర్చలు జరిపిన అనంతరం తిరుగు పయనమయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News