Sunday, December 22, 2024

జగన్‌మోహన్ దే హెచ్‌సిఎ అధ్యక్ష పీఠం

- Advertisement -
- Advertisement -

ఉత్కంఠ పోరులో అర్శనపల్లి విజయం 

మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఆరు పదవుల కోసం ఎన్నికలు నిర్వహించారు. ఇక అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికలో యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సిఎ ప్యానెల్ తరఫున పోటీ చేసిన అర్శనపల్లి జగన్‌మోహన్ రావు విజయం సాధించారు. ఆయన తన సమీప అభ్యర్థి, క్రికెట్ ఫస్ట్ ప్యానెల్‌కు చెందిన అమర్‌నాథ్‌ను ఓడించారు. జగన్‌మోహన్ రావుకు 63 ఓట్లు రాగా, అమర్‌నాథ్ 61 ఓట్లు సాధించారు. ఇక ఉపాధ్యక్ష పదవిని గుడ్ గవర్నెన్స్‌ను ప్యానెల్‌కు చెందిన దల్జీత్ సింగ్ సొంతం చేసుకున్నారు.

కార్యదర్శిగా క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ అభ్యర్థి దేవరాజు జయకేతనం ఎగుర వేశారు. సంయుక్త కార్యదర్శి పదవిని గుడ్ గవర్నెన్స్ ప్యానెల్‌కు చెందిన బసవరాజు దక్కించుకున్నారు. ట్రెజరర్‌గా జగన్‌మోహన్ ప్యానెల్‌కు చెందిన సిజె శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కౌన్సిలర్ పదవిని క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ అభ్యర్థి సునీల్ అగర్వాల్ కైవాసం చేసుకున్నారు. హెచ్‌సిఎలో మొత్తం 173 మంది ఓటర్లు ఉండగా 169 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నలుగురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. కాగా, సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వర్ రావు ఏకసభ్య కమిటీ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వి.ఎస్. సంపత్ కుమార్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. కాగా, ఎన్నికలను పురస్కరించుకుని ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఈ విజయం ఎంఎల్‌సి కవితక్కకు అంకితం..
హెచ్‌సిఎ అధ్యక్ష పదవి దక్కడంపై అర్శనపల్లి జగన్‌మోహన్ రావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితక్కకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు. ఆమె ప్రోత్సాహం వల్లే తాను హెచ్‌సిఎ ఎన్నికల్లో పోటీ చేశానని వెల్లడించారు. మంత్రులు కెటి రామారావు, హరీష్ రావుల మద్దతు దక్కడం గర్వంగా ఉందన్నారు. తమ ప్యానెల్‌పై నమ్మకంతో కీలకమైన రెండు పదవులను అప్పగించిన హెచ్‌సిఎ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తమ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ సదా రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అందరి సహకారం వల్లే తాను కీలకమైన హెచ్‌సిఎ అధ్యక్ష పదవిని సొంతం చేసుకోగలిగానని తెలిపారు. రానున్న రోజుల్లో హెచ్‌సిఎను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని జగన్‌మోహన్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News