పూరీ : ఒడిషాలోని విశ్వవిఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర మంగళవారం స్థానిక పురవీధుల్లో కనులపండువగా సాగింది. ప్రతి ఏటా జగన్నాథుడు ఈ సముద్ర తీర పట్టణంలోని 12వ శతాబ్ధపు రాతి ఆలయం బలభద్రుడు, సుభద్రల సమేతంగా ఆచారం ప్రకారం రథంపై ఊరేగుతూ వెళ్లడం ఆనవాయితీగా సాగుతోంది.శ్రీకృష్ణుడి అవతారమైన జగన్నాథుడు తన తోబుట్టువులను తీసుకుని తన మేనత్త ఉండే గుండిచా ఇంటికి వెళ్లడం, అక్కడ వారంరోజుల పాటు వీరు తమకు ఇష్టమైన పిండివంటలు ఆరగించడం అనే రివాజు మేరకు సాగే బ్రహ్మండమైన రథయాత్రకు ఈసారి దాదాపు పదిలక్షల మంది జనం తరలివచ్చినట్లు అంచనా వేశారు.
తాను నెలవుండే ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే మేనఅత్తింటికి ఈ యాత్ర సాగుతుంది. చెల్లెలు సభద్ర కోరిక మేరకు తోబట్టువులతో కలిసివెళ్లడం చారిత్రక ఆత్మీయ ఘట్టంగా సాగుతోంది. మధ్యాహ్నం పూట ఎర్రటి ఎండలో కండరాలు తళతళమెరుస్తూ ఉండగా దాదాపు 45 అడుగుల ఎతైన మూడు రథాలను భక్తులు లాగుతుండగా, జై జగన్నాథ, హరిబోల్ నినాదాలు మిన్నంటుతుండగా , పలురకాల వాయిద్యాలు మోగుతూ ఉండగా నెమ్మదిగా ఈ పట్టణంలో ప్రధాన వీధుల గుండా యాత్ర సాగింది. ప్రతి ఏటా ఆషాడ మాసం శుక్ల పక్షం రెండోరోజున ఈ యాత్ర జరుపుతారు.
ఈ భారీ యాత్రలో పాల్గొనడం అదృష్టమని భావించి దేశ విదేశాల నుంచి వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి తరలివస్తారు. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు పోటీపడుతారు, హిందువులు ప్రత్యేకించి వైష్ణవులకు ఈ జగన్నాథ రథయాత్ర అత్యంత కీలక ఘట్టంగా నిలుస్తుంది. గవర్నర్ గణేష్ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ రథాల తాళ్లను యాత్ర ఆరంభసూచికగా లాగడంతో ఈ ఘట్టం ఉదయం ఆరంభం అయింది. అంతకు ముందు తెల్లవారుజామున పూరీ గజపతి మహారాజ వంశస్తుడు అయిన దివ్య సింఘా దేబ్ ఆచారం ప్రకారం ఈ రథాలను బంగారు చీపురుతో ఊడ్చారు. పూజారుల మంత్రోచ్ఛారణలు, పూల్లు , సుగంధ ద్రవ్యాలను వెదజల్లడంతో, పలు కీర్తనల ఆలాపనం జరిగింది. పలువురు భక్తులు ఈ యాత్ర దశలో రథాల ఎదుట భక్తి పారవశ్యంతో నృత్యాలకు దిగారు.
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసు బలగాలు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్రికులు, భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పాటించాల్సిన అన్ని క్రతువులను సకాలంలో పూర్తి చేసుకుని పద్ధతి ప్రకారం యాత్ర నిర్వహించినట్లు స్థానిక ఆలయ నిర్వాహణ అధికారి రంజన్ కుమార్ దాస్ తెలిపారు. యాత్ర దశలో ఓ చోట కొందరు వ్యక్తులు తొక్కిసలాటలో కిందపడ్డారు. అయితే వెంటనే పరిస్థితిని చక్కదిద్దారు.
గాయపడ్డ వారిలో ఐదుగురిని ప్రత్యేక మార్గం ద్వారా ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. యాత్రలో ముందుగా పెద్దన్నయ్య బలరాముడు లేదా బలభద్రుడు, తరువాత సోదరి సుభద్ర ఆ తరువాత జగన్నాథుడు రథాలపై బయలుదేరారు. యాత్ర ఆరంభంలో ఆచారం ప్రచారం పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి హాజరయ్యారు. రథయాత్ర నేపథ్యంలో భక్తులకు , ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇతరులు శుభాకాంక్షలు తెలిపారు.