వినుకొండ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పేదవారికి, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అన్నారు. ఈ యుద్ధంలో వెన్నుపోట్లు, మోసాలకు పాల్పడే వారితో మీ బిడ్డ(జగన్ రెడ్డి) ఒంటరి పోరాటం చేస్తున్నారన్నారు. తనకు చంద్రబాబుకు అండగా ఉన్నట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 లేవన్నారు. తాను కేవలం ప్రజలను నమ్ముకుని ఈ యుద్ధం చేస్తున్నానన్నారు. తనకు ఎవరితోనూ పొత్తులు లేవని, తాను ఎవరినీ నమ్ముకోలేదని స్పష్టం చేశారు. తనకు ఉన్నదల్లా దేవుని దయ, ప్రజల దీవెన అన్నారు.
‘తోడేళ్లంతా ఒక్కటవుతున్నాయి… అయినా భయపడకుండా మీ బిడ్డ సింహలా ఒక్కడే ఎదుర్కొంటున్నాడు. మిమ్మల్ని నమ్ముకునే మీ బిడ్డ ముందుకు దూసుకుపోతున్నాడు’ అని చెప్పుకొచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో సోమవారం జరిగిన ‘జగనన్న చేదోడు’ మూడో విడత ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు చెందిన 330145 బ్యాంకు ఖాతాల్లో రూ. 330.15 కోట్లను బటన్ నొక్కి జమ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చిన్న తరహా వ్యాపారలు సంక్షేమం కోసం చేపట్టిందే ‘జగనన్న చేదోడు’ పథకం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని దర్జీలు, రజకులు, నాయూ బ్రాహ్మణులకు ఏటా రూ. 10 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.