అమరావతి: సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాటాల పంపకాల వివాదంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్.షర్మిల, వైఎస్ విజయమ్మ, చాగరి జనార్ధన్ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డి, రీజినల్ డైరెక్టర్ ఆగ్నేయ ప్రాంతం, రిజిస్ట్రారర్ ఆఫ్ కంపెనీస్, తెలంగాణను ప్రతివాదులుగా చేర్చారు.
తాము కంపెనీ అభివృద్ధి కోసం కృషి చేశామని, 2019 ఆగస్టు 21న చేసుకున్న అవగాహన పత్రం ప్రకారం విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించామని, కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన షేర్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు.
షర్మిల ఇటీవల రాజకీయంగా తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ ఆఫర్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. తన తల్లికి, చెల్లికి వాటాలు ఇవ్వదలచుకోలేదని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కు తెలిపారు. కాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పుడు ఈ తతంగం అంతా చర్చనీయాంశం అయింది.