హైదరాబాద్: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్) కావాలని కలలు కంటున్న ఓ చెత్త ఏరే మహిళ కూతురుకు చేయూత ఇవ్వడానికి నటుడు జగపతి బాబు ముందుకొచ్చారు. అర్పిన జయలక్ష్మి ఐఏఎస్ కావడానికి ఎంతో శ్రమిస్తోంది. ఆమె కోచింగ్‌కు అయ్యే ఖర్చును భరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఓ పేరుమోసిన టివి ఛానెల్‌లో జయలక్ష్మి గురించి ఆయన చూశారు. ఆమె తల్లి చేయూత ఇవ్వాల్సిందిగా వేడుకుంది. నటుడు జగపతి బాబు జయలక్ష్మిని కలుసుకోవడమే కాకుండా ఎగ్జామ్‌కు ప్రిపేరవుతున్న ఆమెకు చేయూతనిస్తానన్నారు.
జయలక్ష్మి తల్లిదండ్రులు ఇళ్ల నుంచి చెత్త ఏరుతుంటారు. వారి కుటుంబం హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో నివాసముంటోంది. జయలక్ష్మి ఇప్పుడు డిగ్రీ విద్యార్థిని. ఆమె చిల్డ్రన్స్ పార్లమెంట్ నేతృత్వంలో సమావేశాలు ఏర్పాటుచేసి గుడిసెవాసుల సమస్యలను ఎలుగెత్తి చాటుతుంటుంది. ఆమె ప్రస్తుతం ‘వరల్డ్ చిల్డ్రెన్స్ పార్లమెంట్’ కు ప్రధానిగా వ్యవహరిస్తోంది. వివిధ దేశాల ప్రతినిధులతో ఆన్‌లైన్ మోడ్‌లో తమ సముదాయంకు చెందిన సమస్యలను చర్చిస్తుంటుంది.
జయలక్ష్మికి 2022లో ‘ఛేంజ్ మేకర్’ అవార్డు కూడా లభించింది. ఇటీవలి కాలం వరకు హైదరాబాద్‌లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్‌గా పనిచేసిన డాక్టర్ ఆండ్య్రూ ఫ్లెమింగ్ గత నెల తన ట్వీట్‌లో తాను ఇటీవల హైదరాబాద్‌లో కలిసిన ప్రేరణాత్మక వ్యక్తుల్లో ఆమె ఒకరని రాశారు. జయలక్ష్మి మున్ముందు ఏమి సాధిస్తుందో వేచి చూద్దాం. ఆమెకు చాలా మంది ప్రముఖుల ఆశీస్సులు, అండదండలైతే ఉన్నాయి మరి.