దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆందోళనతో రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యసభలో ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ధన్‌ఖడ్ పలు ప్రశ్నలు సంధించారు. ‘దేశం మారుతుండడం తొలిసారి చూస్తున్నా& అభివృద్ధి చెందిన భారత్ కోసం కలలు కనడం కాకుండా దానిని లక్షంగా నిర్ణయించుకుని ముండుకు సాగడం మొదటిసారి చూస్తున్నా& దేశం ఉన్నత శిఖరాల దిశగా పయనిస్తోంది. అయితే. రైతులు మాత్రం ఆందోళన చేస్తున్నారు. వారు రోడ్లపైకి ఎక్కి తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. దేశంలో రైతు మాత్రమే అసహాయుడిగా మిగిలిపోతున్నాడు.
అసలు ఏమి జరుగుతోంది?’ అని మంత్రిని ధన్‌ఖడ్ అడిగారు. ‘రైతులకు ఇచ్చిన హామీలు ఏమిటి? వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నాం’ అని ధన్‌ఖడ్ నిలదీశారు. ‘రైతులు నిరుడు ఆందోళన చేశారు. ఈ ఏడాది ఇప్పుడు కూడా ఆందోళన చేస్తున్నారు’ అని ఆయన గుర్తు చేశారు. అయితే, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహా దీనికి జవాబు ఏదీ ఇవ్వలేదు. ఉప రాష్ట్రపతి ప్రశ్నలకు చౌహాన్ మౌనాన్ని ఆశ్రయించారు. గత 15 ఏళ్లుగా మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన శివరాజ్ సింగ్ చౌహాన్‌ను బిజెపి అధిష్ఠానం కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని వ్యవసాయ శాఖను అప్పగించిన విషయం విదితమే.