Monday, December 23, 2024

ఉప రాష్ట్రపతి ధన్‌కర్

- Advertisement -
- Advertisement -

Jagdeep Dhankhar declared Vice President of India

భారీ మెజార్టీతో గెలిచిన జగదీప్ ధన్‌కర్
మార్గరేట్ అల్వాకు 182 ఓట్లు
528 ఓట్లతో 70 శాతం మద్దతుతో విజేత
షెకావత్ తరువాత ఈ పదవిలో రెండో జాట్‌నేత

న్యూఢిల్లీ : దేశ ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికలలో అధికార ఎన్‌డిఎ అభ్యర్థి జగదీప్ ధన్‌కర్ శనివారం భారీ మెజార్టీతో గెలిచారు. ఆయన తమ సమీప ఏకైక పోటీదారు అయిన విపక్ష అభ్యర్థి 80 సంవత్సరాల మార్గరేట్ అల్వాను ఓడించారు. ఉప రాష్ట్రపతి కావడానికి అవసరం అయిన ఓట్ల సంఖ్యాబలం 371 . ధన్‌కర్‌కు 528 ఓట్లు వచ్చాయి. మార్గరేట్ అల్వాకు విపక్ష ఎంపిల నుంచి 182 ఓట్లు దక్కాయి.దీనితో ఇక ఎం వెంకయ్యనాయుడు తరువాత దేశ 14వ ఉపరాష్ట్రపతి బాధ్యతలను 71 సంవత్సరాల ధన్‌కర్ చేపడుతారు. పోలింగ్ శనివారం ఐదుగంటలకు ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. తరువాత సాయంత్రానికి ఫలితం వెలువడింది. విపక్షంలో ప్రధాన పార్టీఅయిన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఓటింగ్‌కు గైర్హాజరు అయింది. దీనితో ఆది నుంచి విజేత ఎవరనేది ఏకపక్షంగా సాగింది. మొత్తం పోలయిన ఓట్లతో పోల్చుకుంటే ధన్‌కర్‌కు 70 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. వెంకయ్యనాయుడు ఎన్నిక దశలో ఆయన సాధించిన మెజార్టీని ఈసారి ధన్‌కర్ తోసిరాజన్నారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మొత్తం 780 మంది ఎంపీలు ఓట్లు వేయాల్సి ఉంది. వీరిలో 543 మంది లోక్‌సభ , 245 మంది రాజ్యసభ సభ్యులు . దాదాపుగా 725 మంది ఎంపీలు ఉపరాష్ట్రపతి అభ్యర్థుల గెలుపోటములను ఖరారు చేస్తూ ఓటేశారు. బెంగాల్ గవర్నర్‌గా వ్యవహరించిన ధన్‌కర్‌కు పట్టం కట్టారు. ఎనిమిది స్థానాలు ఇప్పుడు రాజ్యసభలో ఖాళీగా ఉన్నాయి. 34 మంది టిఎంసి ఎంపీలు ఓటేయలేదు. అయితే పార్టీ నిర్ణయాన్ని కాదంటూ టిఎంసికి చెందిన దివ్యేందు అధికారి, శిశిర్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎన్‌డిఎలోని మొత్తం ఎంపిల బలం 441. వీరిలో బిజెపి ఎంపిల సంఖ్య 394. లోక్‌సభలో బిజెపికి సంపూర్ణ బలం ఉండటం, రాజ్యసభలో ఈ పార్టీకి 91 మంది సభ్యుల బలం ఉండటంతో ధన్‌కర్ గెలుపు సునాయసం అయింది. ఐదుగురు నామినేటెడ్ ఎంపీలు కూడా జగదీప్ ధన్‌కర్‌కు ఓటేశారు. మార్గరేట్ అల్వాకు ఆది నుంచి ఎదురుగాలి ఉండటం ఈ తుది ఫలితంతో స్పష్టం అయింది. అల్వాకు కాంగ్రెస్, డిఎంకె, టిఆర్‌ఎస్ , ఆర్జేడీ, ఎన్‌సిపి, సమాజ్‌వాది పార్టీ , ఆప్, జార్ఖండ్ ముక్తిమోర్చా , వామపక్షాలు మద్దతు పలికాయి. శివసేన ఉద్ధవ్ వర్గం కూడా అల్వాకు మద్దతు ప్రకటించింది. ఎన్నికలలో జగదీప్ ధన్‌కర్ విజయం సాధించినట్లు ఆ తరువాత అధికారికంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోక్‌సభ సెక్రెటరీ జనరల్ ఉత్ఫల్‌కుమార్ సింగ్ ప్రకటించారు.

పోలయిన 92 శాతం ఓట్లలో చెల్లనివి 15

ఇంతకు ముందటి ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొంచెం స్వల్పంగా 92.94 శాతం పోలింగ్ జరిగిందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. పోలయిన ఓట్లలో 15 ఓట్లు చెల్లకుండా పొయ్యాయి. గత ఆరు దఫాలుగా జరిగిన ఉప రాష్ట్రపతిఎన్నికలతో బేరీజు వేసుకుంటే ధన్‌కర్‌కు అత్యధిక మెజార్టీ దక్కింది.

ఫలితాలకు ముందే బిజెపి సంబరాలు
ప్రధాని మోడీ, నడ్డా శుభాకాంక్షలు

ఓ వైపు ఓట్ల లెక్కింపు జరుగుతున్న దశలోనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ నివాసం వద్ద ధన్‌కర్ అక్కడ ఉన్నప్పుడువిజయనేపథ్యంలో కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకున్నారు. ఉప రాష్ట్రపతిగా ధన్‌కర్ గెలుపొందిన వెంటనే ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షులు నడ్డా, కేంద్ర సీనియర్ మంత్రులు ధన్‌కర్‌ను కలుసుకుని అభినందనలు తెలిపారు. విపక్ష అభ్యర్థి మార్గరేట్ అల్వా విజేత అయిన ధన్‌కర్‌కు శుభాకాంక్షలుతెలిపారు. తనకు సంఘీభావం తెలిపిన ప్రతిపక్ష నేతలకు ధన్యవాదాలు చెప్పారు. ధన్‌కర్‌కు విపక్ష సభ్యుల నుంచి కూడా మద్దతు దక్కింది. నవీన్ పట్నాయక్‌కు చెందిన బిజెడి, జగన్మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్, బిఎస్‌పి, టిడిపి , జెఎంఎం, అకాలీదళ్, ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం బాసటగా నిలిచింది. ఈ నెల 11వ తేదీన ధన్‌కర్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అంతకు ముందు రోజు వెంకయ్యనాయుడు వైదొలుగుతారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News