న్యూఢిల్లీ : రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ శుక్రవారం తమ ఛాంబర్‌లో ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, సభానేత పియూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. ఇతర ఫ్లోర్‌లీడర్స్‌తో కూడా మాట్లాడారు. సభలో ఆవేశకావేశాల వాతావరణం ఏర్పడటం దురదృష్టకరమని, దీనిని నివారించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వీరికి ధన్‌కర్ తెలిపారు. అయితే దీనికి స్పందనగా ఖర్గే మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి వైఖరిని సమర్థిస్తారా? ఆయన సభలో మాట్లాడకుండా , పార్లమెంట్‌లో ఘటనలపై టీవీల ఇంటర్యూలలో మాట్లాడుతున్నారు. ఇది పద్ధతేనా అని ప్రశ్నించారు. సభ భద్రతకు సంబంధించిన విషయం వచ్చిందని, దీనిపై హోం మంత్రి సభలలో ప్రకటన చేయాల్సి ఉంటుంది .
ఈ విధంగా జరగడం లేదని తెలిపారు. ఘటనపై అమిత్ షా సభలో ప్రకటన చేస్తే దీనిపై చర్చకు వీలేర్పడుతుందని, పరిస్ధితి సద్దుమణుగుతుందని ఇండియా కూటమి పార్టీలు తెలిపాయి. జాతీయ భద్రతకు సంబంధించిన విషయంపై ప్రస్తావించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని, ఓ వైపు అధికార పక్షం బాధ్యతల నుంచి తప్పించుకుంటుంది. మరోవైపు విపక్షాలు బాధ్యత నిర్వర్తిస్తే కాదంటుందా? అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. బిజెపి ఎంపిని రక్షిస్తారు. విపక్ష సభ్యులపై వేటేస్తారు ఇదేం న్యాయం అని ఖర్గే నిలదీశారు.