మన రైతులు ప్రపంచంలోనే
మొదటిస్థానంలో నిలవాలి
అన్నదాతల ఎదుగుదలకు
విజ్ఞాన కేంద్రాలు కృషి
చేయాలి సేంద్రీయ రైతు
సమ్మేళనంలో ఉపరాష్ట్రపతి
జగదీప్ ధన్‌ఖఢ్
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి/కౌడిపలి: ప్రపంచంలోనే భారతదేశ రైతులు మొదటిస్థానంలో నిలవాలని, రైతుల భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖఢ్ అన్నారు. మెదక్ జిల్లా, కౌ డిపల్లి మండలం, తునికి గ్రామ శివారులో గ ల డాక్టర్ రామానాయుడు కృషి విజ్ఞాన కేం ద్రంలో బుధవారం నిర్వహించిన ప్రకృతి సేంద్రీయ రైతు సమ్మేళనానికి ఉప రాష్ట్రపతి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికాసానికి జై విజ్ఞాన్… జై అనుసంధాన్ అనే నినాదంతో మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. మెదక్ జిల్లాలో 655 మంది రైతులు సేంద్రియ సేద్యం చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించడం గొప్ప విషయమని అన్నారు. గ్రామం చిన్నదైనప్పటికీ అందరికీ మార్గదర్శకమని కొనియాడారు. గ్రామ రైతులు సేంద్రియ సాగులో తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధ్ది మార్పు సాధించారని కితాబు ఇచ్చారు. ఈ గ్రామ సేంద్రీయ సాగు రైతులంతా మూడు రోజులపాటు ఢిల్లీలో తన స్వగృహానికి అతిథులుగా రావాలని కోరారు.
త్వరలో మన దేశం, జపాన్, జర్మనీ దేశాలను వెనక్కి నెట్టి ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతోందని తెలిపారు. నాటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలో కిసాన్ దివస్‌ను ప్రకటించారని, త్వరలోనే వైభవంగా ఆ దివస్ రజతోత్సవం నిర్వహించుకోబోతున్నామని అన్నారు. దేశంలో 730 పైచిలుకు కృషి విజ్ఞాన కేంద్రాలు, 150 ఐకార్ సంస్థలు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నాయని అన్నారు. ఇంధనం, సహజవనరులను అవసరం మేరకే వినియోగించుకుని పండించిన పండ్లు, కూరగాయలను యూనిట్లుగా ఏర్పాటు చేసి స్థానికంగానే విక్రయించుకోవాలని, తద్వారా గ్రామీణ వ్యవస్థ అభివృద్ది చెందుతుందని రైతులకు సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రాలలో శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ ఊహించిన ఫలితాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పది కోట్ల మంది రైతులు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు వంటి సంస్థలు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వ విద్యుత్ రాయితీలపై ఆధారపడకుండా సోలార్ విద్యుత్ ఉపయోగించుకునే విధంగా రైతులను చైతన్యపరచాలని సూచించారు.
దేశ రైతులు సాగులో ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఎదిగేందుకు విజ్ఞాన కేంద్రాలు, ఐకార్‌లు కృషి చేయాలన్నారు. గాంధీజీ స్వదేశీ నినాద స్పూర్తితో ఫోకల్ ఫర్ లోకల్‌కు ప్రధాని మోడీ పిలుపునిచ్చారని అన్నారు. 1989లో విదేశీ మారకద్రవ్య నిధులతో పోల్చుకుంటే ప్రస్తుతం 700రెట్లు పెరిగిందన్నారు. ఆందోళనలో ఉన్న రైతులతో చర్చించివారి సమస్యలకుపరిష్కారం చూపాలని సూచించారు. భూ, వాయు, అంతరిక్ష, ఆకాశమార్గాల్లో భారత్ దూసుకెళ్తోందని అన్నారు. ప్రతి పౌరుడు జాతీయ వాదంపై విశ్వాసంతో ఉండాలని సూచించారు. తొలుత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండా సురేఖ ఉప రాష్ట్రపతి దంపతులకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి కొండా సురేఖతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నేత బాగ్యయ్య, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఎంపి రఘునందన్‌రావు, అదనపు కలెక్టర్ నగేష్, ఎస్‌పి ఉదయ్‌కుమార్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.