ధన్‌ఖర్ వ్యాఖ్యలకు సిబల్ ఖండన
న్యూఢిల్లీ : క్రిమినల్ చట్టాలపై కాంగ్రెస్ నేత పి చిదంబరం వ్యాఖ్యలను విమర్శించినందుకు ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖర్‌పై రాజ్యసభ ఎంపి కపిల్ సిబల్ ఆదివారం విరుచుకుపడ్డారు. రోజువారీగా పార్లమెంటరీ ప్రక్రియలను కించపరుస్తున్నది ప్రతిపక్షం కాదని సిబల్ అన్నారు. మూడు కొత్త క్రిమినల్ చట్టాలను ‘పార్ట్ టైమర్లు రూపొందించినవి’గా వ్యాఖ్యానించినందుకు చిదంబరాన్ని ధన్‌ఖర్ విమర్శించిన మరునాడు సిబల్ అలా అన్నారు. చిదంబరం వ్యాఖ్య ‘క్షమార్హం కాదు’ అని ధన్‌ఖర్‌పేర్కొంటూ, ఆయన తన ‘అపఖ్యాతి, పరువు నష్టం కలిగించే, అవమానకర’ వ్యాఖ్యను ఉపసంహరించాలని కోరారు.
ఒక ప్రముఖ జాతీయ దినపత్రికలో చిదంబరం ఇంటర్వూను తాను చదివినప్పుడు తనకు ‘నోట మాట రాలేదు’ అని ధన్‌ఖర్ తెలిపారు. ‘మూడు క్రిమినల్ చట్టాలను పార్ట్‌టైమర్లు రూపొందించారన్న చిదంబరం ప్రకటనను పార్లమెంట్ విజ్ఞతకు క్షమించరాని అవమానంగా ధన్‌ఖర్ విమర్శించారు. మేము అంతా పార్ట్‌టైమర్లమే ధన్‌ఖర్‌జీ! పార్లమెంటరీ ప్రక్రియలను ఎవరు రోజువారీగా కించపరుస్తున్నారు? మేము కాదు’ అని స్వతంత్ర రాజ్యసభ ఎంపి కపిల్ సిబల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు.