Sunday, December 22, 2024

నవంబర్ 5న మౌనం వీడతా

- Advertisement -
- Advertisement -

Jagga Reddy announced that he will break his silence on Nov5

జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ ఏడాది నవంబర్ 5న మౌనం వీడుతానని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను జీవితకాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. వెళ్లిపో అనే వరకు తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆయన తేల్చి చెప్పారు. అదే పరిస్థితి వస్తే తాను స్వంత పార్టీని ఏర్పాటు చేసుకుంటానని చెప్పారు. నవంబర్ 5న తాను మౌనం వీడుతానన్నారు. అదే రోజున గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడతానన్నారు. దేశాన్ని కాంగ్రెస్ మూడు ముక్కలు చేసిందన్న బిజెపి నేత బండి సంజయ్ విమర్శలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పుడు బండి సంజయ్ పుట్టి ఉంటే దేశ విభజనను అడ్డుకొనేవారా? అని ఎద్దేవా చేశారు. నోరుందని ఏది పడితే అది మాట్లాడడం బండి సంజయ్‌కు అలవాటైందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి కొందరు నేతలు పార్టీని వీడి వెళ్తున్న కూడా జగ్గారెడ్డి ఎందుకు నోరు మొదపడం లేదనే విషయమై స్పందించడానికి నిరాకరించారు. కొన్ని రోజులుగా జగ్గారెడ్డి తన నియోజకవర్గంలోనే ఉంటున్నారు. సోమవారం జరిగిన సిఎల్‌పి సమావేశానికి మాత్రం జగ్గారెడ్డి హాజరయ్యారు.

హైదరాబాద్‌లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తన జిల్లాలోని పార్టీ కార్యక్రమాలకు మాత్రమే జగ్గారెడ్డి పరిమితమయ్యారు. పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి తీరుపై జగ్గారెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. గతంలో రాహుల్‌గాంధీ వద్ద తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియా వేదికగా విమర్శలు చేయవద్దని కూడా రాహుల్‌గాంధీ హెచ్చరించారు. దీంతో పార్టీ వ్యవహారాల విషయమై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం మానేసిన విషయం తెలిసిందే. పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలో కొందరు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలో సమయం దొరికినప్పుడల్లా రేవంత్‌రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు.

అయితే, రేవంత్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ క్యాడర్‌లో జోష్ వచ్చింది. అంతేకాదు, ఇటీవల కాలంలో ఇతర పార్టీలలోనుండి కాంగ్రెస్‌లో చేరికలు కూడా ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఈ సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడటం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న కీలక విషయాల్లో జగ్గారెడ్డి స్పందించేవారు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలపై జగ్గారెడ్డి నోరు మొదపడం లేదు. అయితే, తాజాగా నవంబర్ 5న తాను నోరు మెదుపుతానని వ్యాఖ్యానించడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News