Thursday, January 23, 2025

జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దు… టికెట్ ఇవ్వొద్దు..!

- Advertisement -
- Advertisement -
  • బిఆర్‌ఎస్ నేతల అభిప్రాయం

సంగారెడ్డి: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిని బిఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకోవద్దని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆయనకు ఇవ్వరాదని బిఆర్‌ఎస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరుతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనే సంగారెడ్డిలో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న టాక్ నడుస్తోంది. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు కొంత అయోమయంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే , జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర చేనేత కార్పోరేషన్ ఛైర్మన్ చింతా ప్రభాకర్ స్థానంలో జగ్గారెడ్డికి టికెట్ ఖరారయిందన్న ప్రచారం రోజుకు రోజుకు విస్త్రతంగా ప్రచారం జరుగుతున్న క్రమంలో… నియోజకవర్గ పార్టీ ముఖ్య నేతలు సంగారెడ్డిలోని ఒక ఫంక్షన్ హాలులో బుధవారం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి అటు చింత ప్రభాకర్ కానీ, ఇటు డిసిసిబి వైస్ ఛైర్మన్ మణిక్యం గానీ, సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మిరవి కానీ హాజరు కాలేదు. వివిధ మండలాల పార్టీ బాధ్యులు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. కొందరు ఎంపిపిలు, జడ్‌పిటిసి సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నరహరిరెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరి, చింత ప్రభాకర్ ముఖ్య అనుచరుడు వెంకటేశ్వర్లు, నర్సింలు, పులిమామిడి రాజు తదితరులు పాల్గొన్నారు. వీరిలో కొందరు సమావేశంలో సైలెంట్‌గా కూర్చున్నారు. కొందరేమో తమ అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. మెజార్టీ నేతలు చింత ప్రభాకర్‌కే తిరిగి టికెట్ ఇవ్వాలని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది.

జగ్గారెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దని, టికెట్ ఇవ్వొద్దని అన్నట్టు తెలుస్తోంది. ఇక చింత ప్రభాకర్‌కు టికెట్ ఇవ్వని పక్షంలో తమకు టికెట్ ఇవ్వాలని డాక్టర్ శ్రీహరి అన్నట్టు తెలుస్తోంది. తాను చాలా ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నానని, తనకు తగిన గుర్తింపు రాలేదని ఆయన అన్నట్టు తెలిసింది. ఇక తన సేవా కార్యక్రమాలు చూసి తనకు టికెట్ ఇవ్వాలని పులి మామిడి రాజు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు ఒక నాయకుడు తెలిపారు. జగ్గారెడ్డి పార్టీలోకి చేరినప్పటికీ తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని కొండాపూర్ ఎంపిపి మనోజ్‌రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విధంగా వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే చింత ప్రభాకర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఆయన లేకుండా, ఆయన ఇన్‌చార్జిగా ఉన్న నియోజకర్గంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశం జరపడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సమావేశాలు జరగ లేదు.ఇక రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతల సమావేశానికి హాజరు కాగా, ఆయన్ని యువనేత రాహుల్ గాంధీ స్వయంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. ఏకాంతంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి బిఆర్‌ఎస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతలోనే ఆయన్ని పార్టీలోకి చేర్చుకోవద్దని బిఆర్‌ఎస్ నేతలు చర్చించుకోవడం గమనార్హం.ఇక తనకే టికెట్ ఇవ్వాలన్న అభిప్రాయాన్ని మరింత బలంగా వినిపిస్తూ…మాణిక్యం నిత్యం నియోజకర్గంలో పర్యటిస్తున్నారు. దేవాలయాలకు, ఇతర కార్యక్రమాలకు భారీగా చందాలు ఇస్తున్నారు. బుధవారం నాటి సమావేశానికి ఆయన కూడా హాజరు కాకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆ విధంగా పార్టీ టికెట్ రేసులో అగ్ర భాగాన ఉన్న ఇద్దరు నేతలు లేకుండానే ఈ సమావేశం జరగడంతో… పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News