రేవంత్, తాను అన్నదమ్ముల్లాంటివాళ్లం: జగ్గారెడ్డి
హైదరాబాద్: టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యల్లో రేవంత్ తప్పు లేదని, తప్పంతా తనదేనని ఎంఎల్‌ఎ, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఒప్పుకొన్నారు. శుక్రవారం తాను మీడియా ముందుకు వచ్చి నేరుగా మాట్లాడటం తప్పని.. తన తప్పును ఒప్పుకుని పార్టీకి క్షమాపణ చెప్పారు. రేవంత్‌రెడ్డి, తాను అన్నదమ్ముల్లాంటి వాళ్లమని తెలిపారు. మీడియా ముందు అలా మాట్లాడొద్దని పార్టీ ఇంఛార్జి చెప్పారని పేర్కొన్నారు. ఇక నుంచి నేరుగా పార్టీ వ్యవహారాలు మీడియాతో మాట్లాడనని జగ్గారెడ్డి వెల్లడించారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించేలా ఉన్నాయన్న అభిప్రాయంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ రంగంలోకి దిగారు.
ఈ విషయమై గాంధీభవన్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షుల సమావేశం నిర్వహించారు. రేవంత్‌రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎఐసిసి ఇంఛార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్ కృష్ణన్‌లతో పాటు మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ సమావేశమయ్యారు. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డిని వివరణ కోరారు. సమావేశం అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. జగ్గారెడ్డి శుక్రవారం మాట్లాడిన వ్యాఖ్యలపై వివరణనిచ్చారని, సమాచార లోపంతో వివాదం రాజుకుందని తెలిపారు. జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలు సరైనవే అని ఆయనపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు.