హైదరాబాద్: సోనియా, రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక బిజెపి ఈడిని ఉసిగొల్పి వేధింపులకు పాల్పడుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ”దేశవ్యాప్త పాదయాత్ర తో బీజేపీని నిలదీయడానికి రాహుల్ సిద్దం అయ్యారు. దీంతో బీజేపీకి భయం పట్టుకుంది. ఈడితో రాహుల్ పాద యాత్ర చేయకుండా అడ్డు కునే కుట్ర చేస్తున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే మోడీ పేదవారికి ఇస్తానన్న 15 లక్షలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తారు. రాహుల్ పాదయాత్ర చేస్తే పెట్రోల్, డీజల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచిన దానిపై ప్రశ్నిస్తారు. ప్రభుత్వ ఆస్తులను మోడీ, ఆదానిలకు అమ్మేస్తున్నారని ప్రశ్నిస్తారు. ఇందుకే బీజేపీ సోనియా, రాహుల్ గాంధీని ప్రజల నుండి దూరం చేయాలని ఈడీని అడ్డుపెట్టి కుట్ర చేస్తుంది. ఏఐసిసి కార్యాలయంలోకి పోలీస్లు చొరబడి దాడి చేయడం దుర్మార్గం. సోనియా, రాహుల్ గాంధీలను రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీతో వేదించాలనీ చూస్తున్నారు. రేపు కాంగ్రెస్ తడాఖా ఎంటో చూపిద్దాం. కాంగ్రెస్ కార్యకర్తల బలం ఎంటో చూపెడదాం. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ విభాగం అంతా సిద్దం అవ్వండి. రేపు ఉదయం 10 గంటలకు పిజెఆర్ విగ్రహం దగ్గరకి రండి. రాజ్ భవన్ ముట్టడి చేద్దాం. ఇక బీజేపీ నేతలకు నిద్రలేకుండా చేస్తాం. కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడితో రేపు గవర్నర్ కు సైతం నిద్ర పట్టోద్దు. రాజ్ భవన్ గేట్లు బద్దలు కొడుతాం” అని పేర్కొన్నారు.
Jagga Reddy fires on BJP over ED Raids