పూర్తి స్థాయి సమయాన్ని పార్టీ కోసం వినియోగిస్తా
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు లేఖ రాశారు. తన కార్యాచరణను లేఖలో పేర్కొన్నారు. ఒక బలవంతడు భూమి మీద ఎప్పటికి బలవంతుడిలాగే ఉండడు. కొన్ని సంవత్సరాలు మాత్రమే బలవంతుడిగా ఉంటాడు. ఎదో ఒక్కరోజు బలహీనుడు కాకతప్పదు. ఇది ఏ వ్యవస్థలోనైనా వ్యాపారం, రాజకీయం ఇంకా ఏ రంగలోనైనా ఇంతే. అలాగే బలహీనుడు ఎప్పటికి బలహీనుడుగానే ఉండడు. ఆ బలవంతుడి సమయం గడిచే వరకు బలహీనుడు మౌనంగానే ఉంటాడు. ఆ మౌనం బలహీనుడి బలహీనత కాదు. బలహీనుడు కాలం యొక్క సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. కాలము చేసే నిర్ణయంలో బలహీనుడు ఒక్కరోజు బలవంతుడు అవుతాడు. ఎలాగైతే మనిషి జీవితం యవ్వన్నం నుంచి ముసలితనం వరకు ఎలా ఉంటుందో. అలాగే ఈ బలవంతుడు -బలహీనుడి కథ కూడా అంతే. ఒక నాయకుడి గెలుపు ప్రజలను పరిపాలించే సమయం. ఒక నాయకుడి యొక్క ఓటమి గతంలో పరిపాలించిన పరిపాలనలో ఉన్న లోపాలను సమీక్షించుకొని భవిష్యత్‌లో విజయాలు సాధించడానికి మళ్లీ సవరించుకొని ప్రయాణం చేసి ముందడుగు వేసే సమయం.
3 సార్లు సంగారెడ్డి నుంచి ప్రజలు గెలిపించారు
జగ్గారెడ్డిగా తాను 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. 3 సార్లు సంగారెడ్డి ప్రజలు నన్ను గెలిపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా మంచిగా పరిపాలించా. మొదటి సారి 2014లో ఓడిపోయినా. ఆ ఓటమి నాకు చాలా అనుభవాలు నేర్పింది. ఇప్పుడు 2023లో రెండోసారి ఓడిపోయినా. ఈ 10 రోజులోనే ఇంకా చాలా అనుభవాలు నేర్చుకున్నా. అయితే ఈ సారి మా సంగారెడ్డి ప్రజలకు నాకు 5 ఏళ్లు రెస్ట్ ఇచ్చారు. అందుకే ఈ సమయాన్ని నేను పూర్తిగా పార్టీ ఆర్గనైజేషన్ కోసం పని చేయాలని ఆలోచన చేసుకున్నా. సోనియా గాంధీ రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ అలాగే తెలంగాణ పిసిసి చీఫ్, సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల కోసం ప్రవేశపెట్టిన 6 పథకాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలతో పాటు తాను ఎమ్మెల్యేగా లేకపోయినా సంగారెడ్డి ప్రజలకు కూడా అందుతాయి.
ఇప్పుడు ప్రస్తుతానికి నేను కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారానికి సంబదించిన ఆర్గనైజేషన్ పనిని ఒక తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పూర్తి టైమ్ కేటాయించాలనుకుంటున్నా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇప్పుడు పిసిసి, సిఎం రేవంత్ రెడ్డి అనుమతితో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీకి పూర్తి సమయాన్ని ఇవ్వాలని నా యొక్క ఆలోచనను కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ప్రభుత్వంలో ఉన్న నాయకత్వానికి, నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తున్నానంటూ జగ్గారెడ్డి లేఖను రాశారు.