టోరంటో : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను నేరస్థుడిగా కెనడా ప్రతిపక్ష ఎన్‌డీపీ (నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ) నేత , ఖలిస్థానీ సానుభూతి పరుడు జగ్మీత్ సింగ్ ఆరోపించారు.ఆయనను జి7సదస్సుకోసం కెనడా భూభాగంపై అడుగు పెట్టనీయకుండా నిషేధించాలని డిమాండ్ చేశారు. బుధవారం జగ్మీత్‌సింగ్ మాట్రియాల్ కౌన్సిల్ ఆన్ ఫారెస్ రిలేషన్స్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మన ప్రజాస్వామ్యానికి, సార్వభౌమత్వానికి ముప్పుగా మారి, మన ఆర్థిక వ్యవస్థను , మన మిత్రులను, ప్రపంచాన్ని బెదిరించిన వ్యక్తిని ఎందుకు అనుమతించాలని ఆయన ప్రశ్నించారు.
ట్రంప్‌ను ఆపేందుకు జి7 వేదికను వాడుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని, మిత్రదేశాలను ఆయన అభ్యర్థించారు. సింగ్ ప్రకటనపై ఇప్పటివరకు కెనడా ప్రభుత్వం స్పందించలేదు. ప్రధాని కార్యాలయ ప్రతినిధి సైమన్ లాఫార్చూ స్పందిస్తూ దీనిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని వెల్లడించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల్లో చాలావరకు తనకు కోపం తెప్పించాయని, అయితే ఇదే సమయంలో కలిసి పనిచేసే మార్గాలను వెతకాలని ఇంధన శాఖ మంత్రి జోనాథన్ విల్కిన్సన్ పేర్కొన్నారు. జూన్ 15 నుంచి 17 వరకు అల్బర్టాలో జీ7 సమావేశాలు జరగనున్నాయి.