Thursday, January 23, 2025

బుల్డోజర్ ప్రజాస్వామ్యం!

- Advertisement -
- Advertisement -

మత ఆధిక్యతలో అనేక బతుకులు ఛిద్రమైపోతున్నాయి. బుల్డోజర్ కింద నలిగి శకలాలుగా మిగిలిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సామాన్యుల ఆర్తనాదాలు దయలేని వందేమాతరాల చెవులకు ఏమాత్రం ఎక్కలేదు. ఈ విధ్వంసాన్ని నిలుపుదల చేయమని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా తొలుత లెక్క చేయలేదు. ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహిస్తే తప్ప ఆ అధికారిక విధ్వంసం ఆగలేదు.
ఢిల్లీలోని జహంగీర్‌పురిలో రోడ్డు పక్క షాపులు ఏర్పాటు చేసుకుని బతుకుతున్న చిన్న చిన్న వ్యాపారుల పైన కేంద్రం ఆధ్వర్యంలోని ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం బుల్డోజర్లతో విరుచుకుపడింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఉన్నట్టుండి షాపులను, తాత్కాలిక నిర్మాణాలను, మసీదు గేటును ధ్వంసం చేసింది. అక్రమ నిర్మాణాలను గుర్తించమని ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు ఆదేశ్ గుప్త మంగళవారం ఉత్తర ఢిల్లీ మేయర్ రాజ్ ఇగ్బాల్ సింగ్‌కు లేఖ రాయడంతో ఈ విధ్వంసం జరిగింది. నిజానికి దక్షిణ ఢిల్లీలోని సగం ఇళ్ళు అక్రమ నిర్మాణాలే! ఢిల్లీలో దాదాపు 731 కాలనీలు అనధికారికంగా నిర్మించినవే.

వీటన్నిటినీ వదిలేసి కేవలం జహంగీర్‌పురిలోనే అక్రమ నిర్మాణాలను ఎందుకు తొలగించారు? హనుమాన్ జయంతి యాత్ర సందర్భంగా శనివారం జరిగిన మత ఘర్షణలో అరెస్టయిన మైనారిటీ మతస్థులే ధ్యేయంగా ఈ బుల్డోజర్ విధ్వంసం ఎందుకు కొనసాగింది? “కేవలం చిన్న చిన్న షాపులను, టేబుళ్లను, కుర్చీలను, నిచ్చెనలను తొలగించడానికి బుల్డోజర్లు అవసరమా?” అని ప్రశ్నిస్తూ అత్యున్నత న్యాయస్థానమే ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

బుల్డోజర్లతో ఇళ్ళను కూలదోయడం ఏమిటి? పౌరులకు రాజ్యాం గం కల్పించిన జీవించే హక్కును కాలరాయడానికే కదా! 1957 ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం అక్రమ నిర్మాణాలను తొలగించే ముందు ఇంటి యజమానికి నోటీసులివ్వాలి. నోటీసులిచ్చిన 15 రోజులలోగా ఆ నిర్మాణాన్ని తొలగించకపోతే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూలగొట్టవచ్చు. ఇదే చట్టంలోని 322వ సెక్షన్ ప్రకారం అధికారులు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాన్ని కూలగొట్టినట్టయితే అది చట్ట వ్యతిరేకమవుతుంది. జహంగీర్‌పురిలో నోటీసులు ఇవ్వకుండా బుధవారం నిర్మాణాలను కూలగొట్టడం చట్టబద్ధం ఎలా అవుతుంది!? రాజ్యాంగంలోని 19(1) (జి) అధికరణం ప్రకారం ఢిల్లీలోని తోపుడు బండ్ల లో అమ్ముకుని జీవించడం వారి ప్రాథమిక హక్కుగా గుర్తించి కొనసాగించాలని 1989లో రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చింది. తోపుడు బండ్ల వారిని తొలగించడమే తప్పని సరి అయితే, వారికి ముందుగా నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం 2013లో స్పష్టం చేసింది.
బుల్డోజర్ బాబా

ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి నాలుగు రాష్ట్రాల్లో తిరిగి అధికారాన్ని చేపట్టింది. దీంతో ఈ బుల్డోజర్ ప్రజాస్వామ్యం ఊపందుకుంది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో బిజెపి బుల్డోజర్లతో ర్యాలీలు నిర్వహించింది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడి, యోగీ ఆదిత్యనాథ్ రెండవ సారి తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి బుల్డోజర్లతో మైనారిటీ మతస్థుల ఇళ్ళ విధ్వంసానికి పూనుకున్నారు. ప్రతాప్‌ఘర్ జిల్లాలో అత్యాచార నిందితుడి ఇంటికి బుల్డోజర్ వచ్చేసరికి భయంతో అతను లొంగిపోయాడు. మార్చి 25న అమిర్, అసిఫ్ అనే ఇద్దరు నిందితుల ఇళ్ళను అధికారులు కూల్చేశారు. అలాగే రాంపూర్ జిల్లాలోని తండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హత్యకేసులో నిందితుడి ఇంటిని కూడా కూల్చేశారు. నిందితులందరూ నేరస్థులు కాదు. వారిలో నిర్దోషులు కూడా ఉంటారు. న్యాయస్థానంలో నేరం రుజువు అయ్యే వరకు వారు నిందితులే. నిందితులపైన కేసు పెట్టి న్యాయస్థానాలలో హాజరుపరచకుండానే వారి ఇళ్ళను కూల్చేసి భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఇక చట్టాలెందుకు? న్యాయస్థానాలెందుకు!? ఇలా చేస్తే ఇది చట్టబద్ధ పాలన ఎలా అవుతుంది!?
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో చోటు చేసుకున్న విధ్వంసానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిందితుల నుంచి పరిహారాన్ని వసూలు చేయడం మొదలు పెట్టింది. దీన్ని ఆదర్శంగా తీసుకున్న మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఈ పరిహారాన్ని రెట్టింపు చేసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ బుల్డోజర్ ఉపయోగించడం ద్వారా మిగతా బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా తయారై బుల్డోజర్ బాబాగా ప్రసిద్ధి కెక్కారు. మిగతా బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా యోగీ ఆదిత్యనాథ్‌లాగా అధిష్టానం దృష్టిలో పడడానికి బుల్డోజర్‌ను మరింత బలంగా ఉపయోగిస్తున్నారు. లవ్ జిహాదీకి, ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకంగా ‘బుల్డోజర్’ను ప్రయోగించడం సంఘ్ పరివార్ శ్రేణులలో ఆనందాన్ని నింపి, ఒక క్రేజీగా తయారైంది.
బుల్డోజర్ మామ
మధ్యప్రదేశ్‌లోని రాయిగఢ్ జిల్లాలో గత మార్చి 22న రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒక గిరిజనుడు మరణించాడు. ఈ సంఘటనలో నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేయమని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. షియాపూర్‌లో అత్యాచార నిందితుడి ఇంటిని అధికారులు ధ్వంసం చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా మత ఘర్షణలు జరిగాయి. దీన్ని ఆసరా చేసుకుని ఖార్‌గోన్‌లో అధికారులే ముస్లింల ఇళ్ళను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. తలాబ్ చౌక్‌లో జమా మసీదు కాంప్లెక్స్‌ను కూడా కూలగొట్టడానికి ప్రయత్నిస్తుంటే స్థానికులు అడ్డుకున్నారు. ఈ విధంగా బుల్డోజర్‌తో 16 ఇళ్ళు, 29 షాపులు నేలమట్టం చేశారు. నేలమట్టం అయిన ఇళ్ళలో చాలా మటుకు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద మంజూరైనవే. మత ఘర్షణలలలో 80 మందిపైన కేసులు నమోదయ్యాయి. వారిలో అత్యధికులు ముస్లింలే. మధ్యప్రదేశ్‌లో 1984 లో వచ్చిన ‘భూమి వికాస్’ చట్టంలోని నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాల్లో నివసించేవారికి ముందుగా నోటీసు ఇవ్వాలి.
పదిహేను రోజుల సమయం ఇచ్చి, అక్రమ నిర్మాణాన్ని తొలగించకపోతే అప్పుడు చర్య తీసుకోవచ్చు. నోటీసులు ఇవ్వకుండా, కనీస హెచ్చరికలు లేకుండా బుల్డోజర్లతో ఇళ్ళను కూలగొట్టడం చట్టాలను, రాజ్యాంగాన్ని వెక్కిరించడమే అవుతుంది. బుల్డోజర్‌లతో ఇళ్ళను కూలగొట్టించే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పుడు ‘బుల్డోజర్ మామ’ గా ప్రసిద్ధులయ్యారు. బిజెపి ఎమ్మెల్యే రాజేశ్వర శర్మ బుల్డోజర్‌తో ఫోటో తీయించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే బిజెపి పాలిత రాష్ట్రాలలో బుల్డోజర్ ప్రయోగానికి ఎంత క్రేజీ ఏర్పడిందో!
టర్క్‌మెన్ గేట్ విషాదం
ఢిల్లీలోని టర్క్‌మెన్ గేట్ ఉదంతం కాంగ్రెస్ పాలనకు మాయని మచ్చలా తయారైంది. దేశంలో చీకటి రోజులుగా భావించే ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి. ఆమె కుమారుడు సంజయ్ గాంధీ పార్లమెంటు సభ్యుడు. సంజయ్ గాంధీ రాజ్యాంగాతీత శక్తిగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ నగరం సుందరీకరణను చేపట్టారు. అందులో భాగంగా దక్షిణ ఢిల్లీలోని టర్క్‌మెన్ గేట్ వద్ద పేదల ఇళ్ళను తొలగించాలని పది బుల్డోజర్లను ప్రయోగించారు. ఇళ్ళ విధ్వంసానికి బుల్డోజర్లను తొలిసారిగా ప్రయోగించింది సంజయ్ గాంధీనే. ఏకబిగిన పది బుల్డోజర్లను ఉపయోగించి ఇళ్ళను తొలగించడాన్ని ప్రజలు పెద్ద ఎత్తున నిరసించారు. బుల్డోజర్లను అడ్డుకున్న ప్రజలపై కాల్పులు జరపడంతో అధికారక లెక్కల ప్రకారం పది మంది మరణించారు. ఈ సంఘటన 1976 మే 31వ తేదీన జరిగింది. టర్క్‌మెన్ గేట్ ఉదంతం జలియన్ వాలా బాగ్‌ను తలపించిందన్న వ్యాఖ్యలు ఆ రోజుల్లో బలంగా వినిపించాయి. ఎమర్జెన్సీ ఎత్తివేశాక 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్ ఓటమికి టర్క్‌మెన్ గేట్ ఉదంతం బాగా దోహదం చేసింది. ఈ బుల్డోజర్ ప్రయోగం కాంగ్రెస్ కొంపముంచిందని చెప్పవచ్చు.
బుల్డోజర్‌కు అమెరికాకు చెందిన జేవ్‌‌సు కుమ్మింగ్, జె. ఎర్ల్ మెక్లియోడ్ అనే ఇద్దరు రైతులు 1923లో రూపకల్పన చేశారు. కేవలం వ్యవసాయం కోసమే దీనిని తయారు చేశారు. భారత దేశంలో రాజకీయావసరాల కోసం ఇలా వాడుకుంటారని బుల్డోజర్‌ను తయారు చేసినప్పుడు పాపం వారు భావించి ఉండకపోవచ్చు. తాము తయారు చేసిన బుల్డోజర్ లెక్కలేనన్ని ఇళ్ళను నేలమట్టం చేస్తుందని, వారి జీవితాలను ఇలా పాడు చేస్తుందని వారు కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఒకవేళ బుల్డోజర్ రాజకీయ విధ్వంసాన్ని ఊహించినట్టయితే దాన్ని తయారు చేసేవారు కాదేమో!? మనం రాసుకున్న రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఒకటొకటిగా రాలిపోతున్నాయి. మతాధిక్యతలో ఆరాధనా స్వేచ్ఛనలిగిపోతోంది. అనధికారికంగా ఉన్న అధికార మతంలో పుట్టకపోవడమే నేరమైపోతోంది. పౌరులు ఏ దుస్తులు వేసుకోవాలి, ఏ భాష మాట్లాడాలి, ఏమి చదవాలి, ఏమి చదవకూడదు, ఏం తినాలో, ఏం తినకూడదో కూడా అధికార మతవాదులే నిర్ణయించే పాడుకాలం దాపురిస్తోంది. జీవించే హక్కును కాలరాస్తోంది. స్వార్ధం పేరిట వర్గపూరిత కుటిల నీతులను వల్లెవేస్తోంది. మతం పేరిట మానవ జాతికి గోతులు తవ్వుతోంది. వీటన్నిటినీ చూసి సంఘ్ పరివారం వీరంగం వేస్తోంది. బుల్డోజర్ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News