విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి జై మక్తల్ ట్రస్ట్ వినతిపత్రం
హైదరాబాద్: వెనుకబడిన మక్తల్ నియోజకవర్గం కేంద్రంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి జై మక్తల్ ట్రస్ట్ వినతిపత్రం అందజేసింది. దీంతో పాటుగా నియోజకవర్గంలో విద్యా రంగం అభివృద్ధి చెందేందుకు ఇంటర్ కాలేజీల్లోని ఖాళీలు, స్థానిక పాఠశాలల్లోని ఖాళీలు భర్తీ చేయాలని కోరింది. నారాయణపేట్ జిల్లాలోని మక్తల్లో డిగ్రీ కాలేజీ లేకపోవడం వల్ల విద్యార్థులు 35- నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించి గద్వాల్ వెళ్లి డిగ్రీ చదువుకోవాల్సి వస్తుందని జై మక్తల్ ట్రస్ట్ సభ్యులు మంత్రితో పేర్కొన్నారు. కడియం శ్రీహరి విద్యా శాఖ,ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వినతిపత్రం అందజేయగా కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని అయితే, నేటి వరకు కాలేజీ ఏర్పాటు కాలేదని సందీప్ మక్తాల మంత్రి సబితారెడ్డితో పేర్కొన్నారు. సందీప్ మక్తాల, జై మక్తల్ ట్రస్ట్ వినతిపత్రం పట్ల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారని ఆమె వారికి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో భాగ్యలక్ష్మి వాకిటి, రాజేందర్, సౌమ్య, సాయి, తదితరులు పాల్గొన్నారు.