న్యూఢిల్లీ: ఉక్రెయిన్ లో జరుగుతున్న మారణహోమాన్ని ఖండిస్తున్నామని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ లోక్ సభలో తెలిపారు. బుచా నగరంలో జరిగిన ఘటన తీవ్రమైందని, అక్కడ జరిగిన హత్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా తీవ్రమైన విషయం, స్వతంత్ర దర్యాప్తు కోసం మేము మద్దతు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం విషయంలో భారత్ స్థిరమైన వైఖరి అనుసరిస్తోందని జైశంకర్ పేర్కొన్నారు. రక్తపాతం పరిష్కారానికి దారిచూపదని ఆయన తెలిపారు. చర్చల ద్వారానే పరిస్థితి చక్కదిద్దాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటున్నామని ఎస్ జైశంకర్ సభలో వెల్లడించారు. యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావాన్ని అంచనా వేసి అందుకు తగిన చర్యలు చేపట్టినట్టు వివరించారు. పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న ఈ సమయంలో భారత్ లోని సామాన్యులపై భారం పడకుండా ప్రయత్నిస్తున్నామని జయశంకర్ తెలిపారు.