పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
న్యూఢిల్లీ : భారత ఎన్నికల ప్రక్రియపై పాశ్చాత్య మీడియా కథనాలను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఖండించారు. రాజకీయ నేతల్లాగా భావిస్తూ వారు ఈ కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. “ మన ఎన్నికల అంశంపై పాశ్చాత్య మీడియా నుంచి నాకు పలువ్యాఖ్యలు వినిపించాయి. వారు మన ప్రజాస్వామ్యాన్ని విమర్శిస్తున్నది సరైన సమాచారం లేక కాదు. వారు కూడా మన ఎన్నికల్లో రాజకీయ నేతల్లాగానే ఆలోచిస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. వేసవిలో ఎండలు మండిపోతుంటే , ఈ సమయంలో ఎందుకు పోలింగ్ నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఇంత వేడిలో కూడా మా అత్యల్ప ఓటింగ్ శాతం… మీ రికార్డు స్థాయి ఓటింగ్ కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పాలనుకుంటున్నా” అని మంత్రి కౌంటర్ ఇచ్చారు.
“ వారు మన ఈవీఎంలు, ఎన్నికల కమిషన్, చివరకు మన వాతావరణ పరిస్థితులను కూడా ప్రశ్నిస్తారు. వాటన్నింటిని ఎదుర్కొనేందుకు మనం దృఢంగా ఉండాలి” అని వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల్లో మరోసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని, ప్రధాని మోడీ తోనే దేశాభివృద్ధి జరిగిందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అన్నారు. పదేళ్లకు పూర్వం దేశ పరిస్థితి ఏంటి…మోడీ అధికార పగ్గాలు చేపట్టాక ఎలా ఉందనే విషయం ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు.