Friday, January 24, 2025

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

- Advertisement -
- Advertisement -

మైనార్టీ మతస్థుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
తెలంగాణలో దేశంలో పలు ప్రాంతాలకు చెందిన విభిన్న మతాలు, సంసృతుల ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
మైనార్టీ కమిషన్‌లో తమకు ప్రాతినిధ్యం కల్పించినందుకు సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన జైన మత పెద్దలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మతస్థుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. గంగా జమున తెహజీబ్‌కు నిలయమైన తెలంగాణ రాష్ట్రంలో దేశంలో పలు ప్రాంతాలకు చెందిన విభిన్న మతాలు, సంసృతుల ప్రజలు సుఖశాంతులతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. సోమవారం నాడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సిఎం కెసిఆర్‌తో జైన మత పెద్దలు సమావేశమయ్యారు. తమ మైనార్టీ హక్కులను గుర్తిస్తూ, తమకు మైనార్టీ కమిషన్‌లో ప్రాతినిధ్యం కల్పించినందుకు సిఎం కెసిఆర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా జైన మతస్థుల కోరిక మేరకు జైన భవన్ నిర్మాణానికి ఉప్పల్ భగాయత్‌లో 2 ఎకరాల స్థలాన్ని సిఎం కేటాయించారు. దాంతోపాటు జైన మహావీర్ హాస్పిటల్ ఛైర్మన్, మత పెద్దల విన్నపం మేరకు మాసబ్ ట్యాంకు ప్రాంతంలో దశాబ్దాల కాలంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి ఆదరణ పొందుతూ వైద్య సేవలందిస్తున్న మహావీర్ హాస్పటల్ నిర్మితమై ఉన్న ప్రభుత్వ లీజు స్థలాన్ని సిఎం ఉచితంగా కేటాయించారు. సిఎం కెసిఆర్ నిర్ణయాల పట్ల హర్షధ్వనాలతో జైన సమాజం ధన్యవాదాలు తెలిపింది.

75 ఏండ్లుగా దేశ పాలక వ్యవస్థ వైఫల్యం చెందింది
భారతదేశానికి నీరు, భూమి, వాతావరణం, సూర్యరశ్మి వంటి ప్రకృతి అందించిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో 75 ఏండ్లుగా దేశ పాలక వ్యవస్థ వైఫల్యం చెందిందని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ అన్నారు. దేశంలో లభ్యమవుతున్న ప్రకృతి వనరుల వివరాలను ఒక్కొక్కటిగా సిఎం కెసిఆర్ వారికి వివరించారు. వ్యవసాయాధారిత భారతదేశంలో కేంద్ర పాలకులకు దార్శనికత లేకపోవడమే రైతుల పాలిట శాపంగా మారిందని సిఎం అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఇవాళ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని, ప్రజలందరి సహకారంతో దేశవ్యాప్తంగా ఈ అభివృద్ధిని పరిచయం చేస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

సిఎం కెసిఆర్ పాలన రామ రాజ్యాన్ని తలపిస్తున్నది: జైన సమాజం
గత పాలకుల హయాంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత సమర్థవంతంగా శాంతిభద్రతలను పటిష్టంగా కొనసాగిస్తూ, తెలంగాణను అభివృద్ధి పథాన నడిపిస్తున్న సిఎం కెసిఆర్ పాలన రామరాజ్యాన్ని తలపిస్తున్నదని జైన మత సమాజ పెద్దలు కీర్తించారు. పారిశ్రామికాభివృద్ధి, వ్యాపార వాణిజ్య రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని,ఈ విషయం వ్యాపార వర్గాలైన తమ అనుభవంలోకి స్వయంగా వచ్చిందని స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్‌తో సమావేశంలో జైన మత పెద్దలు మాట్లాడుతూ, మరెవ్వరికీ సాధ్యం కాని ఇంతటి అభివృద్ధి ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికతతో మాత్రమే సాధ్యమైందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, పారిశ్రామిక రంగాలకు అవసరమైన నాణ్యమైన విద్యుత్తు, తదితర మౌలిక వసతులను పటిష్టపరచడంతో నేడు తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని జైన మతస్తుల ఐక్య సంఘం శ్రీ జైన్ సేవా సంఘ్ కమిటి మెంబర్లు, జైన మత ప్రముఖులు స్పష్టం చేశారు.

మత్య్స, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి కెసిఆర్ కలిసి ధన్యావాదాలు తెలిపారు. సిఎంను కలిసిన వారిలో శ్రీ జైన్ సేవా సంఘ్ ఛైర్మన్ అశోక్ బర్మేచా, ప్రెసిడెంట్ యోగేష్ జైన్, వైస్ ప్రెసిడెంట్ వినోద్ సంచతి, సెక్రటరీ జీమురా, జైన్ రత్న అవార్డు గ్రహీత, ఫౌండర్ సెక్రటరీ సురేందర్ లోనియా, మహావీర్ హాస్పటల్ ఎక్స్ ఛైర్మన్ మోతీలాల్ జైన్, మాజీ అధ్యక్షులు గౌతం లోడ, మాజీ కార్యదర్శి బసంత్, మాజీ అధ్యక్షులు గౌతంచంద్ జైన్, జువెల్లరీ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ షెర్మల్ జైన్, జయప్రకాష్ బాంగడ్, హిమాన్షు, తలసాని సాయికిరణ్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News