Sunday, December 22, 2024

జైపాల్ రెడ్డి కృషితోనే 54 శాతం విద్యుత్ తెలంగాణకు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్యుత్ వినియోగం ప్రాతిపదికనే విద్యుత్ విభజన జరిగేలా దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. విభజన చట్టంలో లేని స్పీకింగ్ ఆర్డర్‌ను విద్యుత్ విషయంలో 54 శాతం తెలంగాణకు వచ్చేలా జైపాల్‌రెడ్డి కృషి చేశారని కొనియాడారు. శాసన సభలో పద్దులపై చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం 36 శాతం తెలంగాణలో, 64 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉందన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు 36 శాతం, ఎపికి 64 శాతం విద్యుత్ వచ్చేలా ఉందన్నారు. తెలంగాణను చీకట్ల నుంచి కాపాడింది జైపాల్ రెడ్డి అని కొనియాడారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ దయ, జైపాల్ రెడ్డి కృషి వల్ల విద్యుత్ సమస్య నుంచి తెలంగాణ గట్టెక్కిందని గుర్తు చేశారు.

ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కోనుగోలు, యాదాద్రి పవర్ ప్లాంట్‌పై న్యాయవిచారణ జరుగుతోందని, విచారణ కమిషన్ ముందు వాదనలు వినిపిస్తే బిఆర్‌ఎస్ సభ్యుల నిజాయితీ బయటకు వచ్చేదని, న్యాయ విచారణ కోరిందీ వాళ్లేనని, ఇప్పుడు వద్దంటున్నది వాళ్లేనని దుయ్యబట్టారు. విద్యుత్‌పై విచారణ కొనసాగించాలని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని, విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌ను సోమవారం సాయంత్రం నియమిస్తామని స్పష్టం చేశారు. విచారణలో వీళ్ల అవినీతి బయటకు వస్తుందని అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సత్యహరిశ్చంద్రుడికి ప్రతిరూపం అని జగదీశ్వర్‌రెడ్డి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జగదీశ్వర్‌రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నట్లు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి చురకలంటించారు.

బిహెచ్‌ఎల్ నుంచి సివిల్ వర్క్స్ అన్నీ వాళ్ల బినామీలకే ఇచ్చారని, ప్రైవేటు కాంట్రాక్టులు బిఆర్‌ఎస్ వాళ్లకు ఇవ్వడంతో పనుల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని సిఎం ఆరోపణలు చేశారు. 24 గంటల విద్యుత్ ఇవ్వాలని టిడిపి అధినేత, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే నిర్ణయం తీసుకున్నారని, విద్యుత్ కోతలు ఉండకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. యుపిఎ ప్రభుత్వ నిర్ణయాల వల్లే హైదరాబాద్‌కు ఆదాయం పెరిగిందని కితాబిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News