హైదరాబాద్: విద్యార్థి దశలో జైపాల్ రెడ్డి, తాను మొదటిసారిగా కలుసుకున్నామని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని ఆయన తెలపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఇద్దరం కలిసి పనిచేశామని, సిద్ధాంతాల ఆధారంగా జైపాల్ రెడ్డి రాజకీయాలు చేశారని ప్రశంసించారు. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు లోపించాయని మండిపడ్డారు. చివరి వరకు విలువలకు కట్టుబడిన నాయకుడు జైపాల్ రెడ్డి అని సీతారాం ఏచూరి కొనియాడారు.
ఆయన లేకపోవడం దేశానికి తీరనిలోటు అని, దేశంలో నాలుగు స్తంభాలపై చాలా దాడులు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల నుంచి తట్టుకుని దేశాన్ని కాపాడుకోవాలన్నారు. ఇందుకు మళ్లీ సిద్ధాంతాలు, విలువలతో కూడిన రాజకీయాలు అవసరమని సీతారాం నొక్కి చెప్పారు. జైపాల్ రెడ్డి స్ఫూర్తితో ఆ దిశగా ముందుకెళ్లాలని సూచించారు. లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకునేందుకు పునః సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.