జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై పెట్రోల్ బంకు సమీపంలో ఎల్‌పిజి ట్యాంకర్‌ను ట్రక్కు ఢీకొట్టడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. బంకు సమీపంలో ఉన్న వాహనాలు తగలబడడంతో ఐదుగురు సజీవదహనం కాగా మరో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. గాయపడిన 37 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
క్షతగాత్రులలో మరో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మంటలు భారీ ఎత్తును ఎగసిపడడంతో స్థానికులు భయంతో వణికపోయారు. ట్రక్కులో మండే రసాయనాలు ఉండడంతోనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరమార్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. సిఎం భజన్‌లాల్‌కు ఫోన్ చేసి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు.