Friday, November 22, 2024

కొత్త క్రిమినల్ చట్టాల అమలు వాయిదా వేయాలి: జైరామ్ రమేష్

- Advertisement -
- Advertisement -

మూడు క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయవలసిందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ శనివారం కోరారు. ఆ బిల్లులను పార్లమెంట్ ద్వారా ‘చర్చలు లేకుండా మొండిగా ఆమోదింపచేశారు’ అని రమేష్ ఆరోపించారు. ఆ చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి రావలసి ఉంది. 146 మంది ఎంపిలు సస్పెండ్ అయిన సమయంలో బిల్లులను ఆమోదించినందున పునర్వవస్థీకరించిన హోమ్ శాఖ స్థాయీ సంఘంసమగ్ర సమీక్ష, పునఃపరిశీలన జరపడానికి వీలుగా వాటి అమలును వాయిదా వేయాలని రమేష్ ‘ఎక్స్’ పోస్ట్‌లో సూచించారు. ‘2023 డిసెంబర్25న రాష్ట్రపతి 2023 భారతీయ న్యాయ సంహిత, 2023 భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023 భారతీయ సాక్ష అభినియంలకు ఆమోదముద్ర వేశారు, విస్తృత ప్రయోజనాలకు ఉద్దేశించిన ఆ బిల్లులను సరైన చర్చ లేకుండానే, లోక్‌సభ, రాజ్యసభ నుంచి 146 మంది ఎంపిలను సస్పెండ్ చేసిన సమయంలో పార్లమెంట్ ద్వారా మొండిగా ఆమోదించారు’ అని రమేష్ పేర్కొన్నారు.

‘ఇంతకుముందు దేశవ్యాప్తంగా సంబంధిత వ్యక్తులతో సమగ్ర చర్చ లేకుండానే, స్థాయీ సంఘం సభ్యులైన భారత జాతీయ కాంగ్రెస్‌తో సహా వివిధ రాజకీయ పార్టీలకుచెందిన పలువురు ఎంపిల లిఖిత, అత్యంత వివరణాత్మక పత్రాలను పూర్తిగా అలక్షం చేసి హోమ్ శాఖ స్థాయీ సంఘం ద్వారా బిల్లులను ఆమోదింపచేశారు’ అని ఆయన ఆరోపించారు, మూడు కొత్త చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయని, పునర్వవస్థీకరించిన హోమ్ శాఖ స్థాయీ సంఘం ద్వారా ఆ చట్టాల సమీక్ష, పునఃపరిశీలన జరగడానికి వీలుగా వాటి అమలు తేదీ మార్చాలని కాంగ్రెస్ గట్టిగా భావిస్తోందని రమేష్ తెలియజేశారు. ‘మూడు చట్టాల పట్ల తీవ్ర ఆందోళనలు ఉన్న’ వివిధ న్యాయ నిపుణులు, సంస్థలతో కమిటీ మరింత విస్తృతంగా, అర్థవంతమైన సంప్రదింపులు జరపవలసి ఉంటుందని, ఆ తరువాత 18వ లోక్‌సభ, రాజ్యసథ వాటిని పరిశీలించాలని రమేష్ సూచించారు. కొత్త చట్టాల అమలును వాయిదా వేయవలసిందని శుక్రవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు డిఎంకె కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News