న్యూఢిల్లీ : మణిపూర్‌లో పర్యటించడానికి ప్రధాని నరేంద్రమోడీకి సమయం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. మణిపూర్‌లో కల్లోలిత పరిస్థితులను పరిశీలించడానికి ప్రధాని నరేంద్రమోడీకి ఒక్క రోజు సమయం కూడా ఎందుకు దొరకడం లేదోఅర్థం కావడం లేదు. అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఆయనకు మణిపూర్‌ను సందర్శించే సమయం లేకపోవడం ఎంతో బాధాకరం. దేశంలో ఏం జరుగుతున్నా మోడీకి పట్టింపు లేదు. మణిపూర్ రాష్ట్రాన్ని విడిచిపెట్టారు.
ప్రధాని అధికారం లోకి రావాలని మాత్రమే ఆరాట పడుతున్నారు’ అని జైరాం రమేశ్ ఎక్స్(ట్విటర్) వేదికగా మండిపడ్డారు. మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా మోడీపై విమర్శలు గుప్పించారు. ‘147 రోజులుగా మణిపూర్ ప్రజలు బాధపడుతున్నారు. కానీ ప్రధానికి మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించడానికి సమయం లేదు. మణిపూర్ హింసలో విద్యార్థులను లక్షంగా చేసుకున్న భయానక ఫోటోలు మరోసారి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి.
ఈ గొడవలో మహిళలు, పిల్లలను హింసించడం ఆయుధంగా మారిందని ఇప్పుడు స్పష్టమవుతోంది. అందమైన మణిపూర్ రణరంగంగా మారడానికి కారణం బీజేపీ . ప్రధాని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్‌సింగ్‌ను తొలగిస్తేనే అక్కడి హింసాకాండను ఆపేందుకు మొదటి అడుగు వేసినట్టు అవుతుంది ’ అని ఖర్గే పేర్కొన్నారు. జాతుల మధ్యవైరంతో అట్టుడికి పోయిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు … సాయుధ మూకల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే.
వారి మృతదేహాల ఫోటోలు ఇంటర్నెట్‌పై ఆంక్షలు ఎత్తి వేయడంతో వెలుగు లోకి వచ్చాయి. సోమవారం రాత్రి నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో మంగళవారం నుంచి ఇంటర్నెట్ సేవలను మరో ఐదు రోజుల పాటు నిలిపి వేయనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.