ప్రధానిపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విసుర్లు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆయనను మాస్టర్ ఆఫ్ డ్రామాగా అభివర్ణించారు. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యాక బాధలో ఉన్న భారత ఆటగాళ్లను మోడీ ఓదారుస్తున్న వీడియోను బిజెపి తన అధికారిక ఎక్స్ ఖాతాలో విడుదల చేసిన అనంతరం జైరాం రమేశ్ ఈ మేరకు ధ్వజమెత్తారు. ఇదంతా కపటనాటకమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత డబ్బా కొట్టుకోవడానికి స్వయంగా మోడీనే ఈ వీడియోను కొరియోగ్రాఫ్ చేసి విడుదల చేశారని విమర్శలు గుప్పించారు.
ఆస్ట్రేలియా చేతిలో పరాజయం చవి చూసిన తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్ లో భావోద్వేగానికి లోనయ్యారు. చివరి నిమిషంలో వరల్డ్‌కప్ చేజారిపోయిందని ఆవేదనకు గురయ్యారు. దీంతో వారిలో ధైర్యం నింపేందుకు ప్రధాని మోడీ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి వారిని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఒక్కటొక్కటిగా విడుదల చేశారు. తొలుత షమీని ఓదారుస్తున్న ఫోటో, ఆ తర్వాతి రోజు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఓదారుస్తున్న ఫోటో విడుదల చేశారు. తాజాగా మంగళవారం టీమిండియాను ఓదారుస్తున్న ఫోటోను బిజెపి తన ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది.
ఇలా విడతలవారీగా ఒక్కటొక్కటిగా విడుదల చేయడంపై జైరాం రమేశ్ ప్రధానిని, బిజెపిని తూర్పారబట్టారు.‘ఈ దేశంలో డ్రామాను పండించడంలో మోడీని మించిన వారు ఎవరూ లేరు. ఆయన మాస్టర్ ఆఫ్ డ్రామా. భారత ఆటగాళ్లను ఓదారుస్తున్న వీడియోను స్వయంగా మోడీనే కొరియోగ్రఫీ చేసి విడుదల చేశారు. అయితే ఈ ఫోటోలు, వీడియోలు..వాటి వెనుక ఉన్న అసలు అబద్ధాన్ని బట్టబయలు చేశాయి. తన పరువు కాపాడుకోవడం కోసం మోడీ చేసిన ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇటువంటిచర్యలతో ఇప్పుడు భారత యువత మోసపోరు’ అంటూ జైరాం రమేశ్ విరుచుకుపడ్డారు.
पूरा भारत आपके साथ खड़ा है #TeamIndia 🇮🇳
वर्ल्ड कप फाइनल के बाद भारतीय क्रिकेट टीम से मिले प्रधानमंत्री श्री @narendramodi
कप्तान रोहित शर्मा सहित सभी खिलाडियों का बढ़ाया हौसला। pic.twitter.com/B3vHt7nJSV
— BJP (@BJP4India) November 21, 2023