ఎగువ సభలో ఒక బిల్లుపై సమాధానం ఇస్తున్నప్పుడు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి దురుద్దేశాలు అంటగట్టారని ఆరోపిస్తూ రాజ్యసభలోని కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేష్ బుధవారం ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ వద్ద దాఖలు చేసిన నోటీసులో జైరామ్ రమేష్ మంగళవారం అమిత్ షా విపత్తు నిర్వహణ బిల్లుపై చర్చకు సమాధానం ఇస్తూ పిఎం సహాయ నిధిని కాంగ్రెస్ హయాంలో సృష్టించారని, పిఎం కేర్స్‌ను నరేంద్ర మోడీ హయాంలో ఏర్పాటు చేశారని చెప్పినట్లు తెలిపారు. ‘రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి దురుద్దేశాలు ఆపాదించినందుకు హోమ్ శాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్రాల మండలి (రాజ్యసభ) సభా కార్యకలాపాల, ప్రవర్తన నిబంధనావళిలోని 188 నిబంధన పరరంగా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నా’ అని రమేష్ తన నోటీస్‌లో తెలిపారు. ‘కాంగ్రెస్ హయాంలో కేవలం ఒక కుటుంబానికి ఆధిపత్యం ఉంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్‌కు దానిలో సభ్యత్వం ఉంది.
కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రభుత్వ నిధిలో అంతర్భాగం. వారు ప్రభుత్వానికి ఏ సమాధానం ఇస్తారు?’ అని అమిత్ షా తన సమాధానంలో పేర్కొన్నట్లు రమేష్ తెలిపారు. అమిత్ షా ప్రకటనను పరిశీలించినప్పుడు సోనియా గాంధీ పేరును హోమ్ శాఖ మంత్రి ప్రస్తావించనప్పటికీ ‘ఆమెను ఉద్దేశించే ఆయన ఆ మాటలు అన్నారు, ఆమెకు, జాతీయ ప్రధాని సహాయ నిధి (ఎన్‌పిఎంఆర్‌ఎఫ్) నిర్వహణకు సంబంధించి దురుద్దేశాలు అంటగట్టారు’ అని రమేష్ ఆరోపించారు. ‘సభలో ఏ సభ్యునినైనా ఉద్దేశించి పరువునష్టం కలిగించడం లేదా దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నది సుస్పష్టం. ఈ కేసులో సోనియా గాంధీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఉద్దేశంతో ఆమెపై హోమ్ శాఖ మంత్రి నిరాధార ఆరోపణలు చేశారు. హోమ్ శాఖ మంత్రి ప్రకటన పూర్తిగా అసత్యం, పరువునష్టం కలిగించేది. ఇది సోనియా గాంధీ సభా హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. అందువల్ల, ఈ అంశం సభా హక్కుల ఉల్లంఘన, ధిక్కరణ కిందకు వస్తుంది’ అని రమేష్ తన నోటీస్‌లో తెలియజేశారు. ‘ఈ దృష్టా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాపై హక్కుల ఉల్లంఘన దర్యాప్తు ప్రారంభించవచ్చు’ అని రమేష్ అన్నారు.