గులాం నబీపై జైరాం రమేశ్ నిప్పులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్‌పై ఆ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ మంజూరు చేసిన ఢిల్లీలోని విశాలమైన పచ్చికబయళ్లతో కూడిన బంగళాలలో ఆజాద్ నివసిస్తూ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆజాద్ స్వస్థలం జమ్మూ కశ్మీరులోని భలెస్సాలో కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన భారీ బహిరంగ సభకు సంబంధించిన వీడియోను జైరాం ప్రస్తావిస్తూ ఇదీ అసలు వాస్తవమని.. ఢిల్లీలో మోడీ మంజూరు చేసిన బంగళాలో కూర్చుని తప్పుడు వార్తలు సృష్టించడం కాదని ఆయన దుయ్యబట్టారు. భలెస్సా సబ్ డివిజన్‌లోని అన్ని బ్లాకులకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతినెలా నిర్వహించే సమావేశం కోసం కాంగ్రెస్ కార్యాలయం వద్దకు చేరుకున్న దృశ్యాలతోకూడిన వీడియోను జమ్మూ కశ్మీరు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. గత 50 ఏళ్లకు పైగా ప్రతి నెల ఒకటవ తేదీన సమావేశాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోందని కాంగ్రెస్ తెలిపింది.