ఎన్నికల్లో విజయంపై బిజెపి ధీమాకు జైరామ్ రమేష్ ఖండన
2004 ఫలితాలు పునరావృతం అవుతాయన్న కాంగ్రెస్ నేత
ఇంఫాల్ : రానున్న ఎన్నికల ఫలితాలలో తమదే విజయం అన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రకటనను కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఖండించారు. ‘టైగర్ జిందా హై’ అని, ప్రతిపక్ష కూటమి 2004 నాటి చరిత్రను పునరావృతం చేస్తుందని ఆయన చెప్పారు. ‘భారత్ మెరుస్తోంది’ అనే నినాదంతో ప్రచారం చేసినప్పటికీ ఆ ఏడాది కాషాయ పార్టీ అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని రమేష్ గుర్తు చేశారు. రమేష్ ‘పిటిఐ’కి ఇంటర్వూ ఇస్తూ, దృఢమైన కాంగ్రెస్ మాత్రమే బలమైన ప్రతిపక్షాన్ని ఇవ్వగలదని, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ పార్టీని దృఢతరం చేసే యత్నం అని చెప్పారు.
పార్టీ తన ప్రాక్ పశ్చిమ యాత్రను నిర్వహిస్తూ ఎన్నికల సన్నాహాలను ఎలా సాగిస్తుందన్న ప్రశ్నకు రమేష్ సమాధానం ఇస్తూ, పార్టీకి సంస్థాగత యంత్రాంగం ఉన్నదని, యాత్రతో తీరిక లేకపోయినప్పటికీ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగలరని తెలిపారు. ‘ఎన్నికలు మొదలయ్యే సమయానికి యాత్ర ముగుస్తుంది. బహుశా ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు మొదలు కావచ్చని భావిస్తున్నాను.
అప్పటికి యాత్ర పరిసమాప్తం అవుతుంది. సమావేశాలను ఎల్లప్పుడూ జూమ్‌లో నిర్వహించవచ్చు. అది ఒక సమస్యగా నేను భావించడం లేదు’ అని రమేష్ చెప్పారు. మణిపూర్ నుంచి ముంబయి వరకు 6700 కిమీ మేర రాహుల్ యాత్ర సాగిస్తున్నందున ఎన్నికలకు పార్టీ సన్నాహకాలకు ఇబ్బంది కలగవచ్చన్న ఆందోళనను రమేష్ ఈ సందర్భంగా తోసిపుచ్చారు. ఇది ఇలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ 2024లో మూడవ సారి అధికార బాధ్యతలు చేపట్టగలరని, బిజెపి 400 పైచిలుకు సీట్ల గెలుపే లక్షంగా పెట్టుకుందని పార్టీ నేతలు పలువురు ఇప్పటికీ విస్పష్టంగా ప్రకటించారు.