Sunday, January 19, 2025

ఇండియా కూటమి చెక్కు చెదరలేదు: జైరామ్ రమేష్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘పిల్లిమొగ్గ’ వేసినప్పటికీ, టిఎంసి సుప్రీమో మమతా బెనర్జీ బెంగాల్‌లో పొత్తును కాదన్నప్పటికీ ‘ఇండియా’ కూటమి యథాతథంగా ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆదివారం స్పష్టం చేశారు. అవినీతి గురించి ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ సాగిస్తున్న ప్రచారం ‘డొల్ల’ అని రమేష్ తోసిపుచ్చారు. ఢిల్లీలోని ‘పిటిఐ’ వార్తా సంస్థ కేంద్ర కార్యాలయంలో పిటిఐ ఎడిటర్లతో రమేష్ ముఖాముఖి మాట్లాడుతూ.. ప్రతిపక్షం ఎన్నికలలో సగం మార్కు 272ను దాటుతుందని, బిజెపిని అధికారంలో నుంచి దింపివేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్లు, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, జెఎంఎం నేత హేమంత్ సోరెన్ అరెస్టులు, లోక్‌సభ ఎన్నికలలో అమేథీ, రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పోటీపై ఊహాగానాలు సహా పలు అంశాలపై జైరామ్ రమేష్ మాట్లాడారు.

‘ఎలక్టొరల్ బాండ్ల పథకం తీరును గమనించండి. రూ.4000 కోట్ల బాండ్లను రూ. 4 లక్షల కోట్ల కాంట్రాక్టులతో ముడిపెట్టారు. ఎలక్టొరల్ బాండ్లు, కాంట్రాక్టుల మంజూరు మధ్య సంబంధం ఉంది’ అని రమేష్ పేర్కొన్నారు. బిజెపి ఎంపి ఒకరు మౌలిక వసతుల కల్పన కాంట్రాక్టులు పొందిన తరువాత ఎలక్టొరల్ బాండ్లు కొనుగోలు చేశారు అని ఆయన ఆరోపించారు. ‘మోడీ అవినీతి నిరోధక ప్రచారాన్ని చేపట్టి, అవినీతిపై తన పోరాటానికి హేమంత్ సోరెన్, అర్వింద్ కేజ్రీవాల్‌లను ఉదాహరణలు చూపడం బోగస్. ఎలక్టొరల్ బాండ్ల అంశాన్నే తీసుకుంటే అది పూర్తిగా క్విడ్ ప్రో కో కేసు’ అని రమేష్ అన్నారు.

ప్రతిపక్షాల మధ్య ఐక్యత గురించి రమేష్ ప్రస్తావిస్తూ.. డిసెంబర్ 19న మొత్తం 28 పార్టీలు సంఘటితంగా ఉన్నాయని, కానీ నితీశ్ కుమార్ పిల్లిమొగ్గ వేశారని, మమతా బెనర్జీ తాను మమతా బెనర్జీగానే ఉండాలని నిర్ణయించుకున్నారని, ఆ రెండు సంఘటనలు సంభవించాయని ఆయన తెలిపారు. ‘ఇండియా’ కూటమిలో నితీశ్ కుమార్ భాగం కానంత మాత్రాన కూటమి కూలిపోయిందని అర్థం కాదని ఆయన అన్నారు. ప్రతిపక్షంసగం మార్కును దాటుతుందని,‘272 సీట్లకు పైనే వస్తాయని తన నమ్మకమని రమేష్ చెప్పారు. ‘ఇండియా కూటమి బుడగ బద్దలైందా అన్న ప్రశ్నకు ‘లేదు, లేదు. ఎక్కడ బద్దలైంది?’ అని ఆయన అన్నారు. కూటమిలో ఆప్ ఉన్నదని, ఎన్‌సిపి, శివసేన, డిఎంకె, జెఎంఎంతో పొత్తు కొనసాగుతోందని రమేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News