Thursday, December 19, 2024

ప్రజలు తిరస్కరించినా గెలిచానంటావా: జైరాం రమేష్

- Advertisement -
- Advertisement -

ఇప్పటి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వెలువడ్డ ప్రజాతీర్పు అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే ప్రజలు తిరస్కరించినా ఇప్పటికీ ఆయన తానే గెల్చినట్లుగా వ్యవహరిస్తూ, ప్రజాతీర్పును కించపరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. ఫలితాల తరువాత మోడీ వ్యవహారశైలి చాలా అతిశయరీతిలో ఉంది. విచిత్రంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. ఆయన కేర్‌టేకర్ ప్రధాన మంత్రి. అయితే ఇప్పటికీ తనకు ఎదురులేదని ఆయన కుంచించుకుపోయిన తన ఛాతీని చరుచుకుంటున్నారని మోడీ వ్యాఖ్యానించారు. 1962 నుంచి ఇప్పటివరకూ దేశంలో ఏ ప్రభుత్వం కూడా వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చింది లేదని, తనదే ఆ ఘనత అని ప్రగాల్భాలకు దిగుతున్నారని కాంగ్రెస్ నేత తెలిపారు. చరిత్రను వక్రీకరించి చెప్పడం మోడీ వంటబట్టించుకున్న విద్య అని పేర్కొన్నారు. గతంలో ప్రధాని నెహ్రూ మూడుసార్లు ప్రధాని అయ్యారు. ప్రతిసారి అత్యధిక మెజార్టీతో గెలిచారని, ఇది చారిత్రక విషయం అని, ఈ వక్రభాష్య నేత దీనిని కాదనగలరా? అని ప్రశ్నించారు.

ఈసారి ఎన్నికలలో మోడీకి అతి కష్టం మీద 240 స్థానాలు వచ్చాయని, దీనిని అతి గొప్పగా చిత్రీకరించుకుంటున్నారని విమరి ్శంచారు. ఇప్పుడు వెలువడింది మోడీకి వ్యతిరేక తీవ్రస్థాయి ప్రజాతీర్పు అని జైరాం రమేష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని 1989లో భారత జాతీయ కాంగ్రెస్‌కు సొంతంగా 197 స్థానాలు వచ్చాయి. లోక్‌సభలో అత్యధిక సీట్ల పార్టీగా నిలిచింది. అయినప్పటికీ రాజీవ్ గాంధీ తమ ప్రభుత్వ స్థాపనకు డిమాండ్ చేయలేదని గుర్తు చేశారు. తక్కువ సీట్లతో అధికారం ఆశించడం నైతికం కాదని పేర్కొనడం ఆయన హుందాతనానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ స్థాపన గురించి అడిగే నైతిక హక్కు లేదని రాజీవ్ భావించారని తెలిపారు. అయితే ఇప్పుడు ప్రజలు తిరస్కరించినా మోడీ ఇప్పటికీ తనదే అధికారం అనే రీతిలో వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? కనీస హుందాతనాన్ని పాటించాల్సిన అవసరం లేదా? అని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. మోడీ వ్యవహార శైలి చివరికి డెమోక్రసీని డెమో కుర్సీగా చేసిందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News