వాషింగ్టన్ : అమెరికా మీడియాపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ విమర్శలు గుప్పించారు. భారత్‌పై పక్షపాత ధోరణిలో కథనాలు ప్రచురితం చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. మీడియాలో రాజకీయాలు నడుస్తున్నాయంటూ … కశ్మీర్ అంశంపై అగ్రదేశంలో జరిగిన చర్చ గురించి స్పందించారు. “ కొన్ని మీడియా సంస్థల కవరేజిలో పక్షపాత ధోరణి కనిపిస్తోంది. కొందరు తమను తాము భారత్ సంరక్షకులమని భావిస్తుంటారు. కానీ వారు భారత ప్రజల హృదయాలను గెలవలేరు. బయటి నుంచి గెలిచేందుకు ప్రయత్నిస్తుంటారు. బయటి నుంచి ఒక రూపు తేవాలని చూస్తుంటారు.
అయితే విషయంపై మనకు కచ్చితంగా అవగాహన ఉండాలి” అని భారత్ వ్యతిరేక శక్తుల పెరుగుదలపై అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. కశ్మీర్ అంశం, ఆర్టికల్ 370 పై వాషింగ్టన్ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. ఏదైనా ఉగ్రవాద ఘటన జరిగితే… హత్యకు గురైన వ్యక్తి ఏ మతానికి చెందిన వాడనేది ముఖ్యం కాదన్నారు. “ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్న సిబ్బంది, ప్రజల గురించి కాకుండా … ఇంటర్నెట్‌పై నియంత్రణ గురించి చర్చ ఉంటుంది.
ప్రాణనష్టం కంటే ఇంటర్నెట్‌పై నియంత్రణే ప్రమాదకరం అనే దశకు మీరు చేరుకుంటే .. ఇక నేనేం మాట్లాడగలను ? ఆర్టికల్ 370 పై వాస్తవాల వక్రీకరణ జరిగింది. ప్రజలు నిజమేదో, అబద్ధమేదో తెలియక అయోమయానికి గురవుతున్నారు. మీడియాలో రాజకీయాలు నడుస్తుంటాయి. ఈ పోటీ ప్రపంచంలో మన సందేశాన్ని బయటకు తెలియజేయాలి. ప్రజలను విద్యావంతుల్ని చేయాలి. ఈ సమయంలో ఇదే నేను మీకు ఇచ్చే సందేశం ” అని పేర్కొన్నారు.