న్యూఢిల్లీ: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కారణంగా ఏర్పడిన దౌత్యపరమైన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గత నెల వాషింగ్టన్‌లో కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీతో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ విషయాన్ని మెలనీ జోలీ సూచనప్రాయంగా వెల్లడించడం విశేషం.
నిజ్జర్ హత్యపై తమ రెండు దేశాల మధ్య రహస్య సమావేశాలు కొనసాగుతున్నాయని బుధవారం విలేకరుల సమావేశంలో మెలనీ జోలీ సూచనప్రాయంగా తెలిపారు. చర్చలు గోప్యంగా ఉన్నప్పుడే దౌత్యపరమైన సంబంధాలకు మంచిదని, భారత్ విషయంలో తాను ఆ విధానాన్నే కొనసాగిస్తున్నానని జోలీ తెలిపారు.
తమ దేశంలో ఉన్న కెనడా దౌత్యవేత్తల సంఖ్యను సగానికి పైగా కుదించాలంటూ భారత ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను కెనడా ప్రభుత్వం ఇంకా అమలుచేయవలసి ఉందని వర్గాలు తెలిపాయి. దేశాన్ని వీడిన ఒకరిద్దరు దౌత్యవేత్తలు తిరిగి భారత్ చేరుకున్నట్లు వారు చెప్పారు. దౌత్యవేత్తల సంఖ్యలో సమానత్వం ఉండాలన్న వియన్నా ఒడంబడికను భారత్ ప్రస్తావిస్తుండగా తమ దౌత్యవేత్తలకు భారత్‌లో భద్రతా ముప్పు ఉందని కెనడా చెబుతోంది.
కాగా..కెనడా విదేశాంగ మంత్రితో జరిపిన రహస్య సమావేశం గురించి వ్యాఖ్యానించడానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ నిరాకరించారు. కాని కెనడా ప్రభుత్వం మాత్రం రహస్య చర్చలను సమర్థిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగాలని తాము కోరుకోవడం లేదని, ఈ క్లిష్ట సమయంలో భారత్‌తో నిర్మాణాత్మక సంబంధాలు కొనసాగించడానికి తాము గుట్టుగా చర్యలు తీసుకుంటున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పడం గమనార్హం.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు వాషింగ్టన్‌లో ఉన్నారు. అమెరికా నాయకులు, మేధావులతో పాల్గొన్న సమావేశాల గురించే భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.