ఇరు దేశాల మధ్య ప్రస్తుతం సంబంధాలు సాధారణ స్థితిలో లేవు
చైనాకు స్పష్టం చేసిన భారత్
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో జైశంకర్ చర్చలు
న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య ప్రస్తుతం సంబంధాలు సాధారణ స్థితిలో లేవని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఎంత మేర భద్రతా దళాలు ఉండాలనే దానిపై 1993-96 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయని, ఆ ఒప్పందాలకు విరుద్ధంగా ఇప్పుడు సరిహద్దుల్లో భద్రతా దళాలు ఉన్నాయని జైశంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో పరిస్థితి మామూలు స్థితికి రావాలంటే తూర్పు లడఖ్ ప్రాంతంలో మిగిలి ఉన్న వివాదాస్పద ప్రాంతాలనుంచి కూడా బలగాల ఉపసంహరణ వేగంగా పూర్తి కావలసిన అవసరం ఉందని జైశంకర్ స్పష్టం చేశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో జైశంకర్ శుక్రవారం దాదాపు మూడు గంటల సేపు సమావేశమ్యారు. ఈ భేటీ అనంతరం మంత్రి విలేఖరులతో మాట్లాడారు.
సైన్యాన్ని ఉపసంహరిస్తేనే ఇరు దేశాల సరిహద్దుల్లో సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఆయన స్పష్టం చేశారు. 2020 ఏప్రిల్ తర్వాత చైనా చర్యల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాల్లో చాలా ఇబ్బందులు తలెత్తాయని ఆయన స్పష్టం చేశారు. తూర్పు లడఖ్ వివాదంపై ఇప్పటివరకు ఇరు దేశాల సైనికాధికారుల మధ్య 15 దఫాలు చర్చలు జరిగాయని, ఈ చర్చల్లో కొంత మేరకు పురోగతి సాధించామన్నారు. అయితే ఇది ఆశించిన స్థాయికన్నా నిదానంగా ఉందని జైశంకర్ తెలిపారు. తూర్పు లడఖ్‌తో పాటు ఉక్రెయిన్‌కు సంబంధించిన అంశాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చాయని జైశంకర్ చెప్పారు. ఎలాంటి అరమరికలు లేకుండా అత్యంత నిజాయితీగా తమ మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. భారత్‌తో సంబంధాల విషయంలో చైనా స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశామని, నిర్ణయాధికారంలో ఇతర దేశాల జోక్యం ఉండకూడదన్న విశ్వాసాన్ని తాము వ్యక్తం చేస్తున్న విషయాన్ని కూడా చైనా విదేశాంగ మంత్రితో చెప్పామని జైశంకర్ తెలిపారు.