మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఇటీవల జియాగూడ బైపాస్ రోడ్డులో సీవరేజీ నెట్ వర్క్ పైపు లైన్ పనుల కోసం మ్యాన్ హోల్ లో ప్రమాదవశాత్తు మృతి చెందిన శ్రీనివాస్, హనుమంతు, వెంకటేశ్వర్లు అనే ముగ్గురు కార్మికుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం బాసటగా నిలిచి ఆర్థికంగా సాయం అందించింది. జాతీయ సఫాయి కర్మాచారి ఛైర్ పర్సన్ ఎం.వెంకటేశన్ మంగళవారం హైదరాబాద్ విచ్చేసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున మూడు కుటుంబాలకు కలిపి మొత్తం రూ.30 లక్షలు విలువైన చెక్కులు తక్షణ సాయంగా జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డితో కలిసి అందజేశారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ తక్షణ సాయం అందజేశారు.
అంతకుముందు చైర్ పర్సన్ ఎం.వెంకటేషన్ ఎండీ, ఉన్నతాధికారులతో కలిసి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈడి డా.ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎంలు రఘు, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.