Sunday, December 22, 2024

మదిని మెలిపెట్టే సంగతులు

- Advertisement -
- Advertisement -

Apoet made out of thousand poets/ A human made out of thousands of human beings’ అని చెప్పిన కవి కవితా తపస్సికుడు, కవితల జాలరి శ్రీనివాస్ గౌడ్. కలం గాలానికి సరి కొత్త అక్షరాల రంగులను ఎరగా తగిలించి కొత్త కొత్త చిన్ని చిన్ని కవితలను చేపలవలె చేజిక్కించుకున్నాడు. చిన్ని చిన్ని సంగతులే కానీ మనిషి మనసులో మెదిలిన పెద్ద పెద్ద సంఘర్షణ కవితలే ఈ చిన్ని చిన్ని సంగతులు పుస్తకం. చిన్ని చిన్ని పదాలతో, చిన్ని చిన్ని వాక్యాలతో, చిన్ని చిన్ని సుతిమెత్తని మాటల కవితలతో ఎందరో పాఠకుల హృదయలను దోచుకున్న ఓ పెద్ద కవి మాంత్రికులు ఆత్మీయ సోదరులు శ్రీనివాస్ గౌడ్. ఎన్నో చిన్ని చిన్ని కవితలను తన కలంలో కదిలించి కాలాన్ని కుదిపేస్తూ ఆణిముత్యాల్లా మెరిసే కవితల ఆయుధాలను కంకణాలుగా చేతికి తొడుక్కొని కలానికి అక్షరాల హారతులు అద్ది ప్రతి కవితకి ప్రతి పేజీకి జీవం పోశాడు.

చిన్ని చిన్ని కవితల్లో చాలా గాఢత లోతైన సారాన్ని సరళమైన పదజాలంతో అర్థవంతమైన పరిశీలనాంశాలతో, ప్రతి కవిత మది పరిమళ భరితమయ్యే వాక్యాలతో ప్రతి పాఠకుణ్ణి ఆకర్షించి బాల్యం మధురజ్ఞాపాకాలలోకి విసిరేసి కూసింత వినోదంలో, కసింతా బాధలో, కాస్తంత విచారంలో పడేటట్లు చేసాడు కవి శ్రీనివాస్ గౌడ్. కవితల దాహం తెలిసిన వాడు కాబట్టే ప్రతి అక్షరాన్ని పేర్చి ప్రతి వాక్యాన్ని మధురంగా అల్లి కవితల వర్షాన్ని చిన్ని చిన్ని సంగతులుగా సృష్టించాడు. ఆ వర్షంలో ప్రతి పాఠకుణ్ణి తడిపేస్తూ ప్రతీ మనిషి హృదయాన్ని తట్టిలేపి కవితల కలలో కలగా కలగనమంటున్నాడు. కవితల సాహిత్యాన్ని ప్రతి మనిషికి సన్నిహిత్యంగా ఉండేలా చేయాలంటారు.
‘నా కలని / పదిమంది కనేట్టు చేయడమే /నా కల‘/పుస్తకం చదివితే ఇలాంటివి మనం చింత చెట్టుకుండే ఆకుల రేమ్మల్లా ఎన్నో చదవచ్చు. అంతా ఆపద్దం అని తెలిసిన తను మాత్రం ఆ కలలు కంటూనే ఉంటాడు. అది మానడం అసాధ్యమే అంటూ/అంతా మాయని తెలిసినా కూడా /మనిషిని నమ్మడం మానలేను నేను అంటూ /మృగ్యమయినా కూడా ప్రేమను వెతకడం మానలేను అంటాడు. అతని హృదయం ఎంతో సున్నితమో అతని కవితలు అంతే లేతగా అంతే పదునైన చురుకుదనంగా ఉంటాయి.

కవి శ్రీనివాస గౌడ్ పాఠకుడి హృదయ స్పందనను మనుషుల విశ్వాస నాడిని పట్టుకున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అని మొదటి కవిత చదివితేనే మరొక్క రెండుసార్లు అదే కవితను చదివేలా చేస్తాడు.
‘అంతా /కల్లని తేలిపోయాక కూడా /కల కనడం మానలేను/అంతా /మాయని తెలిసినా కూడా /మనిషిని నమ్మడం /మానలేను/మృగ్యమయినా కూడా /ప్రేమను వెతకడం మానలేను/నీ గుండె నుండి /చిందే చిరునవ్వు/ సత్యమని నమ్మకుండా/ మనలేను’ ఇలా అనేక కవితల్లో కొత్త రూపాలను కొత్త శైలితో ప్రతి కవిత మనల్ని ఆలోచింపజేసేలా చేస్తాయి. ఇంత చిన్ని చిన్ని పదాలతో మనసును ఆకట్టుకునేలా కవిత్వం రాయడం అనేది నిజంగా ఒక అద్భుతమైన కళ.ఇలాంటి కవులు చాలా చాలా అరుదుగా ఉంటారు. మనుషుల్లో వారి మనసుల్లో ఊహాల ప్రయాణలలో కొన్ని లెక్కలు అపుడపుడు తప్పుతుంటాయి దానికి కవి తేటతెల్లంగా లెక్కల్ని లెక్క చేయకపోవడమే కొన్నింటికి పరిష్కార మార్గం అంటాడు.
కవిత్వంలో ఒక పాదం తడారిన మనుషుల్లో /ప్రేమప్రమిద ఆరిపోయిందని /లెక్కలు కడతామా/త్వరలోనే మన లెక్క తప్పుతుంది! ఇప్పట్లో మనం గోళీలు ఆడే ఆటను చూడటం చాలాచాలా అరుదు అనుకుంటా బహుశా ఆ ఆటను ఆదమరిచెలా చేశారు అభివృద్ధి గోళంలో ధనికులు ఎక్కువై.

కాలాన్ని లాక్కుపోయారు అంటా తన జ్ఞాపకాలను నెత్తుటి పాకంలో మరిగించేశారు ఎవరో? ఎవరు ఎవరై ఉంటారో ఆ జ్ఞాపకాలకు వలవేసినా వాళ్ళు? ‘ఎర్రటి ఎండలో ఆడుతుంటే / గోళీలు లాక్కుని /అమ్మ వెంటపడితే/పారిపోతున్నాను/సావాసగాళ్ళంతా /చుట్టూ చేరి ఎగురుతుంటే /గాలిపటంమై గాలిలొ ఎగురుతున్నాను!/చిన్నప్పటి ఇంటి ముందు /చెల్లాచెదురై వున్నాను/ఇపుడు అమ్మలేదు / అమ్మలాంటి ఇల్లు లేదు’ నిజంగా ఇది చదవగానే కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. మీ గుండె ఎంత మదన పడిందో పాపం, మీ కన్నీళ్లు ఎన్నిసార్లు సిరా సుక్కలై కలవరించాయో, మీ చెక్కిళ్ళ చారికలపై పారె గంగానది అంతరగంగను తుడవడానికి మీ భుజస్కందమై నిలిచే సముద్రుడి చేతులు ఎందుకు చాపలేదో కానీ ప్రతి పాఠకుడికి మాత్రం ఇది చాలా బాధగా ఉంటుంది.

‘కన్నీటిచెమ్మ తప్ప /నాన్న ముద్దు చెమ్మా / నా బుగ్గలెప్పుడూ ఎరగవు’ ఇది చదివాక ప్రతి పాఠకుడి గుండె కాసేపు బరువుగా స్పందిస్తుంది. మీకైనా నాకైనా మరేఎవరికైనా సరే /‘అమ్మ గుర్తుకు వచ్చినంతా /నాన్న గుర్తుకు రాడు/నాన్న ఊసులాగే/నాన్న ఎక్కడో ఉంటాడు’/ ‘గడ్డ కట్టిన కన్నీటి బొట్టు అమ్మ /ఎక్కడ కరిగేది కాదు / నా ఆకలి దగ్గర తప్ప’ ఈ వాక్యం నిజంగా చాలా అద్భుతంగా ఉంది . గడ్డకట్టిన కన్నీటి బొట్టు అంటా అమ్మ హృదయం ఎంత కఠినమో మనం చదువుతూ వెంటనే మళ్ళీ ఆ గడ్డకట్టిన కన్నీటి బొట్టును కొడుకు ఆకలి దగ్గర కరిగిపోయేలా చేశాడు. మనిషి బాధను ఎన్ని కోణాల్లో కావాలంటే అన్ని కోణాల్లో మెలిపెట్టి అక్షరాలను సైతం ఎడిపించేలా చేశారు ఈ కవి.స్త్రీ పక్షపాతిగా వారి ఆవేదనలను కవితల కన్నీటి బొట్లుగా రాల్చాడు. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంటుంది కానీ స్త్రీ మనసును బంధి చేసిన మనషులు గురించి బాధింపబడిన అక్క గురించి సరైన స్వేచ్ఛను ఇవ్వడంలో స్వేచ్ఛ లేగ దూడను గుంజకు కట్టినట్లు అని బ్రతుకు జంజాటన చెప్తూ ఆమెకి పసుపుతాడు పలుపుతాడు ఒక్కటే అంటాడు. కవి మనసు ఇది రాసినప్పుడు ఎంత మదన పడింటుందో మనం కవితలో చూడొచ్చు తన అక్క కోసం రాసిన కవిత ఇది. ‘ఆమెది/గుంజకు కట్టేసిన /లేగదూడ గుంజాటన/పసుపుతాడు పలుపుతాడు/ఆమెకు ఒకటయింది/తాడు తెంచుకోలేకపోవడం/ఆమెకు శాపం అయింది/ఇష్టం లేని బతుకు పట్ల/యాస్త పోవడం తప్ప/ఆమేం చేయలేదు/

కన్నీళ్ళ సుడిగుండమై/ఉకృష్టంలోకి మునకలేయడం తప్ప/ ఆమేం చేయలేదు’ ప్రస్తుత నాగరిక మనుషుల్లో మనం చూస్తుంటాం చాలా మంది కుల్లు కుతంత్రాలతో రోజులు గడుపుతూ జీవనం సాగిస్తుంటారు. కొందరికి మనతోటి మన పక్కింటి మనిషి ఎదుగుతుంటే ఎదలో బాధ, బాగా సంపాదిస్తుంటే అసూయ , మనిషి ప్రశాంతమైన జీవితం సుఖమైన జీవితాన్ని అనుభవిస్తుంటే ఓర్చుకొలేని తనం వాళ్లపై అక్కసు వెళ్లగక్కడం ఇలా సాటి మనిషి బాగును కొరుకొలేక ఊపిరితిత్తుల్లో నింపే సిగరెట్ పొగ మాదిరి మనసు నిండా ద్వేషాన్ని నింపుకొని ఎదను గాయం చేసుకొని ఆ బరువును మోయడం ఎంత కష్టమో చెప్పడానికి కవి ఒక మాట అంటాడు. ‘ద్వేషం మోయడం కన్నా / శిలువ మోయడం సులువు కదా‘ అని ఈ పదం చదివకా మనలోని అహం చావకపోతే మనం జీవిస్తున్న నిర్జీవులంగా ఉండిపోవాల్సిందే అని నా అభిప్రాయం! కరోనా ఉధృతి గురించి అందరికీ తెలిసిందే అయితే ఈ కవి చాలా భిన్నంగా ఎలాంటి పరిస్థితులను మనం ఎలా ఎదుర్కొన్నామో కానీ కవి మాత్రం చాలా దగ్గరగా చూసి ఎదలోతుల్లో ఉన్న భావాలను కవితగా చెప్పాడు. శవాలను కాల్చే కట్టెలు అవమానంతో దహిస్తున్నాయి అంటాడు.

అంటే మనిషి చావును కట్టెలు కూడా అసహ్యించుకుని ఎగతాళి చేస్తున్నాయి. ఇంతా అధ్వానంగా ఎదురుచూపులతో శావాలెప్పుడు క్యూలలో వేచి ఉండి కుళ్ళిపొలేదు. అంటే ఇది ఏ రకమైన నిర్జీవుల ప్రళయ ప్రయాణమో మనం ఊహించచ్చు.కాలం ఎంత కట్టుదిట్టంగా ఏమి కావాలో అవి ముందే చూసుకొని కరోనాతో చెయి కలిపి ముందుచూపుతో అడుగులు వేస్తూ చావు ఆటలు ఆడటానికి చాలా పకడ్బందీగా ప్రణాళిక చేసుకొని ముందుకి దూకి ఆసుపత్రుల్లో చావు బెడ్ల కోసం భేరల్లేని వ్యాపారం జరిగేలా చూసింది. ఇలాంటి వ్యాపారం విజయనగర రాజుల కాలంలో రాసులుపోసి వజ్రాలు అమ్మినప్పుడు కూడా ఎక్కడా జరగలేదు. చచ్చి ఉత్త చేతులతో ఊపుకుంటూ వచ్చిన నిర్జీవ దేహాలకు శ్మశానం ఏమి ఆహ్వానం పలకలేదు చితి పేర్చలేక చేతులెత్తి మొక్కి తనదారి తను చూసుకుంది. ఈ కదలని దేహాలకి కదుల్తున్న మానవాళికి ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా? శ్మశనమే చేతులెత్తేసింది అన్నాడు కవి ఎలాంటి ఘటనలు ఎంత దగ్గరగా చూశాడో మనం ఈ రాతల్లో చూడొచ్చు.

దేశం ఎపుడో చితిమంటగా రగిలింది అన్నాడు. ఆ మంటల్లో పడి బతికి ఉన్న కూడా వాళ్ళు అనాథ ప్రేతంతో సమానం అంటాడు కవి.శవాలను కాల్చే కాటికాపరికి కూడా మనసుంటుంది కదా అతని హృదయం కూడా ఎంత మగ్గిపోయింటుంది కదా తన కన్నీటిని ఆ చితి మంటల్లో తగలబెట్టలేక తానే కాలిపోతున్నాడని అన్నాడు కవి. నిజంగా కరోనా ఉధృతి చాలా మందిని కకావికలం చేసేసింది.కొందరు ఆకలికి అలమటించి చస్తే మరికొందరు ఆత్మస్థైర్యం కరువై ప్రాణ భయంతోనే చచ్చిపోయారు. ఎంత ఘోరాన్ని మనం దాటుకొని ఇపుడు బ్రతికి ఉన్నామో కవి రాసిన కవితని చదివితే మీకే అర్థం అవుతుంది. ‘ఇంత అవమానంతో /కట్టెలు ఎప్పుడూ దహించుకుపోలేదు/ఇంత ఎదురుచూపులతో /శవాలు ఎప్పుడూ క్యూలలో కుళ్ళిపోలేదు/ఇంత పకడ్బందీగా చావుల మీద /ఎప్పుడు వ్యాపారం జరగలేదు’/‘చచ్చి ఉత్త చేతులతో /వచ్చిన నిర్జీవదేహాలకు చితి పేర్చలేక /శ్మశానం కూడా చేతులెత్తేసింది./దేశం ఇప్పుడో చితిమంట /ఎవడికి వాడు బతికున్న అనాథ ప్రేతం./ కాటికాపరి కూడా /కన్నీటిని తగలెయ్యలేక కాలిపోతున్నాడు’ శ్రీనివాస గౌడ్ కవితలు చదువుతున్నప్పుడు మెల్ల మెల్లగా అనిస్తిషియా డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చినపుడు వచ్చే మత్తులా ఆ కవితల ప్రభావం మనకి ఉంటుంది.

శ్రీనివాస గౌడ్ ప్రతి పాఠకుడి హృదయంలో చిన్నిచిన్ని సంగతులు పుస్తకం ఓ నివాసమై పాఠకుడిని ఆకర్షిస్తుంది.మొదలు పెట్టిన మొదటి కవిత ‘అంతా కల్లని తెలిసినా కలకనడం మానలేను‘ నుంచి చివరి కవిత ‘పూలు గాలిలో సుడులు తిరుగుతూ మంచులా రాలిపోతాయి ఆ రాలిపోయేది నేనే‘ అంటూ చివరి కవిత వరకు ఏ మాత్రం పాఠకుణ్ణి పక్కకి కదిలించకుండా హిప్నాటిజం చేసేలా చాలా గొప్ప గొప్ప కవితలు ఇందులో మెండుగా ఉన్నాయి. పుస్తకం చదివాక నాకు పూర్వకాలపు సామెత ఒకటి గుర్తొచ్చింది. దున్నుకున్నొడికి దున్నినంతా భూమి అని. ఈ పుస్తకంలో కవితలు కూడా అంతే చదివినంతా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే కవితలే అన్నీ. నేను చెప్పడం కాదు పుస్తకం పట్టుకుని కూర్చున్న తరువాత మీరే చెప్తారు నేను రాసింది నిజం అని.ఇలాంటి అయస్కాంతంలాంటి అత్యద్భుతమైన అరుదైన భవిష్యత్తు తరాల కవి పితామహుడు శ్రీ ‘పి. శ్రీనివాస గౌడ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.

చేగువేరా హరి
9951310711

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News